
పంచ పాలికెలకు త్వరలో ఎన్నికలు
బనశంకరి: గ్రేటర్ బెంగళూరు ప్రదేశ పరిధిలో ఐదు నగర పాలికెలను ఏర్పాటు చేసి సరిహద్దులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో సజావుగా ఎన్నికలు నిర్వహిస్తుందని డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ చెప్పారు. మంగళవారం విధానసభ సమావేశాల్లో గ్రేటర్ బెంగళూరు పాలక బిల్లు– 2025 ను సవరించి ప్రవేశపెట్టారు. దీనిపై మాట్లాడిన శివకుమార్.. గ్రేటర్ బెంగళూరు ప్రాధికార గురించి స్పష్టత ఇవ్వడానికి సవరణలు అవసరమయ్యాయి. నగర పాలికెలు పాలనాత్మక చర్యలు, నిర్వహణ అధికారాలను చలాయించడం అంటే దీని అర్థం గ్రేటర్ బెంగళూరు మినహా వేరే పాలికె, నగరసభలపై పెత్తనం చెలాయించడం కాదన్నారు.
రాజ్యాంగ విరుద్ధం: బీజేపీ
బీజేపీ ఎమ్మెల్యే అశ్వత్‌నారాయణ మాట్లాడుతూ సిటీ కార్పొరేషన్లను ఎలా చేరుస్తారనేది వివరించాలని కోరారు. గందరగోళం వద్దని, సరిదిద్దుతామని డీసీఎం తెలిపారు. గ్రేటర్ అనేది రాజ్యాంగానికి వ్యతిరేకమని, సీఎంకు అధికారం ఎందుకు ఇచ్చారని అశ్వత్ ఆరోపించారు. ఇది స్థానిక సంస్థల అథోగతికి కారణం అవుతుందని దుయ్యబట్టారు. గ్రేటర్ బదులు సర్కారుకు కన్నడ పేరు దొరకలేదా అని బీజేపీ పక్ష నేత అశోక్ వ్యంగ్యమాడారు. చర్చ తరువాత స్పీకర్ యుటీ ఖాదర్ గ్రేటర్ బెంగళూరు బిల్లును ఆమోదించినట్లు ప్రకటించారు.
మహానగర పాలికెలో కట్టడ నిర్మాణానికి మంజూరు, పన్నులు విధించడం పై పాలికెలకు అవకాశం కల్పించే కర్ణాటక నగర పాలికె సవరణ బిల్లును ఆమోదించారు.
డీసీఎం శివకుమార్ వెల్లడి
గ్రేటర్ బెంగళూరు సవరణకు ఆమోదం