
ఈ రోడ్ల పనులకు మోక్షమెన్నడో?
బళ్లారిటౌన్: నగర శివార్లలోని వాజ్‌పేయి లేఅవుట్ వెనుక భాగంలోని దొడ్డబసవేశ్వర లే అవుట్ నుంచి స్టాండర్డ్ ఇన్‌ఫ్రా లేఅవుట్ వరకు రోడ్లన్ని పూర్తిగా ధ్వంసమై, అడుగు తీసి అడుగు వేయలేని విధంగా మారాయి. ఈ ప్రాంతంలో వందలాది ఇళ్ల నిర్మాణం జరిగింది. గత ఐదేళ్లుగా ప్రారంభం నుంచి స్థానికులే గ్రావెల్ వేసుకుని రోడ్డు నిర్మాణం చేసుకున్నారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఈ రోడ్లన్ని బురదమయంగా మారాయి. మూడేళ్ల క్రితం రూరల్ ఎమ్మెల్యే నాగేంద్రను కలిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆయన్ను కోరారు. 2022 నుంచి ఇక్కడ అభివృద్ధి పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. రోడ్ల అభివృద్ధికి రూ.3.5 కోట్లు నిధులు కావాలని నివేదకను కూడా పంపారు. గత ఏడాది ఆగస్టులో ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు నిధులు మంజూరయ్యాయి. అయితే ప్రస్తుతం వశిష్ట కళాశాల వరకు కేవలం ఒక సీసీ రోడ్డు నిర్మాణ పనులు మాత్రమే ప్రారంభించారు. మిగిలిన రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం చేయాల్సి ఉండగా, ఈ రోడ్లను మూడేళ్లలో దశల వారీగా నిర్మించే యోచనలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న చిత్తడి నేల పరిస్థితి చూసి అయినా ఈ పనులు త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఈ రోడ్ల పనులకు మోక్షమెన్నడో?