
తిరుమల యాత్రలో ఘోర విషాదం
తనకల్లు: ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో కదిరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల వెంకన్నస్వామిని దర్శించుకుని ఇళ్లకు సంతోషంగా తిరుగుముఖం పట్టినవారి మీద మృత్యువు పంజా విసిరింది. ఈ ఘోరంలో నలుగురు చనిపోగా కొందరు గాయపడడంతో బాధితుల కుటుంబాల్లో తీవ్ర విషాదం తాండవిస్తోంది. సోమవారం ఉదయం ఏపీఎస్ ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు, రెండు టూరిస్ట్ మినీబస్సులు ఢీకొన్నాయి. తనకల్లు మండలం మండ్లిపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో టూరిస్ట్ బస్సుల్లోని అనసూయమ్మ (60) అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవర్ మణికంఠ (41), నాగేంద్రప్ప (45), జాహ్నవి (4) చికిత్స పొందుతూ మరణించారు. మృతులంతా కర్ణాటకవాసులే.
ఎలా జరిగిందంటే..
పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి చెందిన భక్తులు రెండు టూరిస్ట్ మినీబస్సుల్లో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. దైవదర్శనం అనంతరం బళ్లారికి తిరుగు పయనమయ్యారు. మార్గంమధ్యలో మండ్లిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఉన్న మలుపు వద్ద కదిరి నుంచి మదనపల్లి వెళుతున్న పల్లెవెలుగు ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న టూరిస్ట్ బస్సు ఢీకొంది. ఆ వెనుకనే వస్తున్న మరో టూరిస్ట్ బస్సు ముందున్న టూరిస్ట్ బస్సును ఢీకొట్టింది. ఒకదానికొకటి బలంగా ఢీ కొనడంతో ముందున్న టూరిస్ట్ బస్సు నుజ్జునుజ్జయ్యింది. అందులో ప్రయాణిస్తున్న అనసూయమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. చిన్నారి జాహ్నవి, డ్రైవర్ మణికంఠ, నాగార్జున, కుమార్‌స్వామి, భార్గవి, రిత్విక, నాగేంద్రప్ప, గోవిందమ్మ, గోవిందప్ప, రాకేష్, చిన్నమ్మ, అంజినమ్మ తీవ్రంగా గాయపడ్డారు.
భీతావహం
వెంటనే స్థానికులు బాధితుల్ని తమ అంబులెన్స్‌లో తనకల్లు ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స తరువాత జాహ్నవి, నాగేంద్రప్ప, మణికంఠ, నాగార్జున, రిత్విక, భార్గవిలను కదిరి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వీరిలో డ్రైవర్ మణికంఠ, నాగేంద్రప్ప, జాహ్నవి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అనంతపురం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వీరు చనిపోయారు. తనకల్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల ఆర్తనాదాలతో ఘటనాస్థలి మార్మోగింది.
రెండు టూరిస్టు మినీ బస్సులు,
ఆర్టీసీ బస్సు ఢీ
ఏపీలో కదిరి వద్ద దుర్ఘటన
నలుగురు మృతి, 9 మందికి గాయాలు
బాధితులు బళ్లారి ప్రాంతవాసులు

తిరుమల యాత్రలో ఘోర విషాదం

తిరుమల యాత్రలో ఘోర విషాదం