
ముంచెత్తిన కుండపోత వానలు
● ఉత్తర కర్ణాటకలో అధికం
యశవంతపుర: రాష్ట్రవ్యాప్తంగా వానలు పడుతున్నాయి. దక్షిణ కన్నడ, ఉడుపి, ఉత్తరకన్నడ, శివమొగ్గ, హాసన్, బెంగళూరు గ్రామాంతర, కలబుర్గి, బాగలకోట, కొప్పళ, గదగ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల పొలాలు నీటమునిగాయి. మైసూరు జిల్లా హెచ్‌డీ కోట తాలూకాలో అనేక కాలనీలు పాక్షికంగా మునిగాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు.
సవదత్తి జాతరకు ఆటంకం
బెళగావి జిల్లా సవదత్తిలో కుండపోత వర్షాలు కురిశాయి. స్థానిక గుట్టపై నుంచి వరద నీరు ప్రవహించింది. ఎల్లమ్మ గుడికి వెళ్లే రోడ్డు మునిగిపోయింది. వాహనాలు బంద్ అయ్యాయి. సవదత్తి నుంచి ఎల్లమ్మ గుడికి వేరే మార్గాల్లో వెళ్లాలని అధికారులు తెలిపారు. శనివారం నుంచి నూల పౌర్ణమి జాతర ప్రారంభమైంది. మహారాష్ట్ర, గోవా నుంచి భక్తులు వస్తుండగా వర్షాలతో ఆటంకం ఏర్పడింది. విజయపుర జిల్లా వ్యాప్తంగా భారీ వానలు పడ్డాయి. సహాయక చర్యల పై మంత్రి హెచ్‌కే పాటిల్ అధికారులతో చర్చించారు. విజయపుర పట్టణంలో అనేక కాలనీలలో నీరు చేరింది. రోడ్లు చెరువుల్లా మారాయి. అనేక చోట్ల పశువులు చనిపోయాయి, పొలాలు, తోటలు మునిగాయి.