
భయానక ఘటన.. వీడిన మిస్టరీ!
తుమకూరు: జిల్లాలో కొరటగెరె తాలూకాలో చింపుగానహళ్ళి వద్ద గుర్తుతెలియని హంతకులు ఓ మహిళ శరీరం ముక్కలు ముక్కలు చేసి చుట్టుపక్కల ప్రాంతాలలో విసిరేసిన భయానక సంఘటనలో హతురాలి ఆచూకీ లభ్యమైంది. తుమకూరు తాలూకాలోని బెళ్ళావి గ్రామానికి చెందిన లక్ష్మిదేవమ్మ (42)గా పోలీసులు గుర్తించారు. ఎవరో ఆమెను హత్య చేసి శరీర భాగాలను కవర్లలో చుట్టి విసిరేశారు. గురువారం రోజున కొందరు జనం చూసి పోలీసులకు చెప్పడంతో దారుణం బయటపడింది. చింపుగానహళ్ళి పరిధిలో 8 చోట్ల 10 నల్ల కవర్లలో శరీర భాగాలు లభించాయి. జిల్లా ఎస్పీ అశోక్, పోలీసులు జిల్లాలోని అందరు డీఎస్పీలు గాలింపులో పాల్గొన్నారు. హంతకుల కోసం వేట సాగిస్తున్నారు.
3న కూతురి
ఇంటికి వెళ్లి..
మహిళ చేతిపై ఉన్న పచ్చ బొట్టు, దుస్తులు, ఇతరత్రా గుర్తుల గురించి గ్రామాల్లో సమాచారం ఇచ్చారు. ఆమె లక్ష్మిదేవమ్మగా తేలింది. కుటుంబ సభ్యులు కూడా గుర్తించారు. ఆమె భర్త బసవరాజు, 4వ తేదీన తుమకూరు రూరల్ ఠాణాలో మిస్సింగ్ కేసు పెట్టాడు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఊర్తిగెరె దగ్గర సిద్దలింగపాళ్యలో ఉండే కుమార్తెను చూసి వస్తానని 3వ తేదీన వెళ్లిందని తెలిపాడు. సాయంత్రం అక్కడి నుంచి బయల్దేరింది, కానీ ఇంటికి చేరలేదు. కేసును అతి త్వరలోనే ఛేదిస్తామని ఎస్పీ తెలిపారు.
హతురాలు తుమకూరు తాలూకావాసి
హంతకుల కోసం ఖాకీల వేట