
కై వార రథోత్సవం
చింతామణి: తాలూకాలోని పుణ్యక్షేత్రమైన కై వార సద్గురు యోగి నారేయణ మఠంలో శ్రావణ మాస పౌర్ణమి పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అమర నారేయణస్వామి, సద్గురు తాతయ్య ఉత్సవమూర్తులకు అభిషేకం, అష్టావధాన సేవలను చేపట్టారు. మఠం ఆవరణలో తేరు ఉత్సవం జరిపారు. పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.
మా అక్క ఐపీఎస్ తెలుసా?
దొడ్డబళ్లాపురం: మద్యం మత్తులో ఐపీఎస్ అధికారి తమ్ముడు పోలీస్‌స్టేషన్‌లో హల్‌చల్ చేసిన సంఘటన గదగ్ జిల్లా బెటగేరి వద్ద జరిగింది. ఐపీఎస్ అధికారిణి అనితా హద్దణ్ణవర్ తమ్ముడు అక్షత్ హద్దణ్ణవర్ మద్యం మత్తులో అర్ధరాత్రి బెటగేరి ఠాణాకు కారులో వచ్చారు. తాను లాయర్‌నని, తన అక్క ఐపీఎస్ అని, తనని ఎవరూ ఏమీ చేయలేరని కేకలు వేయసాగాడు, అడ్డుకోబోయిన స్టేషన్ సిబ్బందిని దుర్భాషలాడాడు. చివరకు పోలీసులు అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి పంపించారు. అతని కారు మీద నో పార్కింగ్ చలానా రాశారని గొడవ చేసినట్టు సమాచారం.
ర్యాగింగ్‌కు డిగ్రీ
విద్యార్థిని బలి
దొడ్డబళ్లాపురం: తోటి విద్యార్థుల వేధింపులకు ఓ విద్యా కుసుమం బలైన సంఘటన బాగలకోట జిల్లా గుళేదగుడ్డ పట్టణంలో చోటుచేసుకుంది. అంజలి ముండాస (21) మృతురాలు, ఈమె పట్టణంలోని భండారి కళాశాలలో బీఏ చివరి ఏడాది చదువుతోంది. తోటి విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో ఆవేదన చెందిన అంజలి డెత్‌నోట్ రాసి ఉరివేసుకుంది. డెత్ నోట్‌లో ఇద్దరి పేర్లతోపాటు వారి ఫోన్ నంబర్లు రాసింది. వర్ష, ప్రదీప్ నన్ను మానసికంగా వేధించి చనిపోయేలా చేశారు, వీరిని కఠినంగా శిక్షించాలి, గుడ్ బై.. అంటూ రాసింది. గుళేదగుడ్డ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
13 ఏళ్లకే పెళ్లి.. కిడ్నాప్ ●
● బెళగావిలో అమానుషం
దొడ్డబళ్లాపురం: సంరక్షణ కేంద్రంలో ఉన్న బాలికను కిడ్నాప్ చేసిన సంఘటన బెళగావి జిల్లా మాళమారుతి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బాలికకు 13 ఏళ్లు ఉండగా నిందితునితో బలవంతంగా పెళ్లయింది. ఆమెకు అనారోగ్యం కలగడంతో ఆస్పత్రికి తీసికెళ్లగా నాలుగు నెలల గర్భంతో ఉన్నట్టు తేలింది. దీంతో బాలికను మహంతేశ్ నగరలో ఉన్న సృష్టి పిల్లల సంరక్షణ కేంద్రంలో వదిలారు. ఈ సంరక్షణ కేంద్రంలో ఎటువంటి సీసీ కెమెరాలు,సెక్యూరిటీ గార్డులు లేవు. బాలికకు మందులు ఇవ్వాలని చెప్పుకుని ఓ వ్యక్తి లోపలకు వచ్చి కత్తితో బెదిరించి బాలికను తీసుకెళ్లాడు. సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితున్ని గుర్తించి బాలికను రక్షించారు. అతనిపై కిడ్నాప్, పోక్సో కేసు నమోదు చేశారు. బాలిక భర్తే ఈ నేరానికి పాల్పడినట్లు తెలిసింది.
కొమ్మ పడి వృద్ధునికి గాయాలు
బనశంకరి: బెంగళూరు నగరంలోని అన్నపూర్ణేశ్వరి నగర పరిధిలో రోడ్డు పక్కన వాకింగ్ చేస్తున్న వృద్ధునిపై చెట్టు కొమ్మ విరిగి పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్.విశ్వనాథ్ బాధితుడు కాగా, నడుము విరిగింది, బాధితున్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పాలికె అటవీ సిబ్బంది చేరుకుని విరిగిపడిన చెట్టుకొమ్మలను తొలగించి వెళ్లిపోయారు. బీబీఎంపీ తీరుపట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. బీబీఎంపీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని బాధితుడు అన్నపూర్ణేశ్వరినగర ఠాణాలో ఫిర్యాదు చేశాడు.

కై వార రథోత్సవం