
మైసూరు జూలో సివంగి కన్నుమూత
మైసూరు: ౖమెసూరు చామరాజేంద్ర మృగాలయంలో ఉన్న రక్షిత అనే ఆడ సింహం కన్నుమూసింది. ఈ సింహం వయసు 21 సంవత్సరాలు, శనివారం ఉదయం 7 గంటల సమయంలో వృద్ధాప్య సమస్యలతో చనిపోయిందని జూ అధికారులు చెప్పారు. ఇది 2004 ఏప్రిల్ 1వ తేదీన ఇదే జూలో నరసింహ, మానిని అనే సింహాల జంటకు జన్మించింది. జూలో ఎంతో ఆకర్షణీయమైన సివంగిగా పేరుబడింది. గత వారం రోజుల నుంచి ఆహారం సరిగా తీసుకోక నీరసంగా ఉండింది. రక్షిత మృతితో జూ సిబ్బంది విచారం వ్యక్తం చేశారు.
కాంతార కంబళ దున్న మృతి
యశవంతపుర: కన్నడ హిట్ సినిమా కాంతారలో నటుడు రిషబ్ శెట్టితో కలిసి నటించిన దున్నపోతు అప్పు కన్నుమూసింది. ఇది కరావళి భాగంలో అనేక కంబళ పోటీలలో పాల్గొని పతకాలను గెల్చుకుంది. బెంగళూరులో జరిగిన కంబళ పోటీలలో ప్రథమస్థానంలో నిలిచింది. కంబళ దున్నలను యజమానులు తమ కుటుంబసభ్యులుగా భావిస్తారు. మంచి ఆహారంతో పాటు సకల వసతులు కల్పిస్తారు. దీని పేరు అప్పు కాగా, కాంతార సినిమా కోసం ఎంపిక చేసుకున్నారు. రిషబ్‌తో కలిసి అనేక సన్నివేశాలలో కనిపిస్తుంది. వయోభారంతో మరణించడంతో యజమానులు, అభిమానులు విషాదానికి లోనయ్యారు. శనివారం ఘనంగా అంత్యక్రియలు జరిపించారు.
రూ.3 కోట్లు తీసుకుని
సినిమా చేయలేదు
యశవంతపుర: సినిమాలో నటిస్తానని చెప్పి రూ.3.15 కోట్ల డబ్బులు తీసుకుని సినిమా చేయలేదని కన్నడ నటుడు ధ్రువ సర్జాపై ముంబైలో అంబోలి పోలీసులు కేసు నమోదు చేశారు. రాఘవేంద్ర హెగ్డే అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు.. ధ్రువ సర్జా తనతో సోల్జర్ అనే సినిమా తీయడానికి ఒప్పుకుని రూ.3.15 కోట్లు తీసుకున్నాడు. 2019 ఫిబ్రవరి 21న ఒప్పందం జరిగింది. ఆ డబ్బులతో అపార్ట్‌మెంట్ తీసుకున్న ధ్రువ సర్జా సినిమాలో నటించలేదు. డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని, న్యాయం చేయాలని అంబోలి ఠాణాలో ఫిర్యాదు చేశాడు.

మైసూరు జూలో సివంగి కన్నుమూత