
10న ప్రతిభా పురస్కారాల ప్రదానం
రాయచూరు రూరల్: జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఈ నెల 10న సింధనూరులోని సత్యగార్డెన్‌లో ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేస్తామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. టెన్త్, ఇంటర్‌లో 90 శాతానికి పైగా మార్కులు పొందిన ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ప్రతిభా పురస్కారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో హంపీ మఠాధిపతి వామదేవ మహంత శివాచార్య మహాస్వామి, భీమవ్వ దొడ్డబాళప్ప, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు షడాక్షరి, మహేష్, నాగరాజ్, ఆసిఫ్, మల్లికార్జునగౌడ, చంద్రశేఖర్, గిరిగౌడ, శివరుద్రయ్య పాల్గొంటారన్నారు. ఈసందర్భంగా శంకరగౌడ, యంకప్ప తదితరులు పాల్గొన్నారు.
శ్మశాన స్థలం కేటాయించరూ
రాయచూరు రూరల్: జిల్లాలోని సింధనూరు తాలూకా ముక్కుందా గ్రామంలో అంత్యక్రియలకు గ్రామస్తులు నానాపాట్లు పడుతున్నారనే వార్తపై స్పందించిన దళిత సేన నేతలు గ్రామంలో శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు జావిద్ ఖాన్ మాట్లాడారు. సింధనూరు తాలూకా ముక్కుందాలో మృతదేహాలకు అంత్య సంస్కారాలు చేయాడానికి తుంగభద్ర నదిలోకి దిగి అవతలి ఒడ్డును చేరుకొని ఖననం చేయాల్సిన దీన స్థితిలో ఉన్నారని, మృతదేహాన్ని మోసుకొని నీటిలో తీసుకెళ్లిన చిత్రాలను చూపించారు. అనంతరం వారు అదనపు జిల్లాధికారి శివానందకు వినతిపత్రం సమర్పించారు.
ప్రభుత్వమే చేనేత
చీరలు కొనాలి
రాయచూరు రూరల్: చేనేత కారులు మగ్గాలపై నేసిన చీరలను సర్కారు కొనుగోలు చేయాలని జిల్లా బీజేపీ మహిళా అధ్యక్షురాలు, మాజీ నగరసభ అధ్యక్షురాలు లలితా ఆంజనేయ డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని ఖాదీ గ్రామీణ భండార్ కేంద్రంలో జాతీయ చేనేతకారుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. విద్యుత్ ధరలు పెంచడంతో కష్టాలు తప్ప లాభాలు లేవన్నారు. ప్రభుత్వం విద్యుత్ బిల్లుల తగ్గింపుపై పునరాలోచించాలన్నారు. చేనేత కార్పొరేషన్ మండలికి చైర్మన్‌ను నియమించాలన్నారు. ఈ విషయంలో ముఖ్య మంత్రి సిద్దరామయ్య ఉత్తర కర్ణాటక ప్రాంతంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించాలన్నారు. ఉచిత విద్యుత్ భాగ్యకు నోచుకోని చేనేతకారులకు దౌర్భాగ్యం పట్టిందన్నారు. కార్యక్రమంలో శరణమ్మ, సులోచన, సుమ గస్తీలున్నారు.
పాలనలో కన్నడకు
ప్రాధాన్యత ఇవ్వండి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పాలనా వ్యవహారాల్లో కన్నడ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని జయ కర్ణాటక సంఘం అధ్యక్షుడు శివకుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు రికార్డులను, రిజిస్టర్లను, చేసిన పనుల పేర్లను కూడా కన్నడలోనే రాయించాలని అధికారులను కోరారు. జిల్లాలోని వివిధ శాఖాధికార్లు కన్నడ భాషకు బదులుగా ఆంగ్లంలో రాయడాన్ని వదిలి పెట్టాలన్నారు. ప్రభుత్వ పనులను చేసినప్పుడు కన్నడలోనే నామఫలకాలను ఏర్పాటు చేసేలా అధికారులకు, కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని జిల్లాధికారికి విన్నవించారు.
బంగారు, వెండి ఆభరణాల చోరీ
హుబ్లీ: నగరంలోని సంతోష్‌నగర్ మధుర పార్క్‌లోని ఓ ఇంటికి వేసిన తాళాన్ని పగలగొట్టి లోనికి వెళ్లిన దొంగలు 120 గ్రాముల బంగారు ఆభరణాలు, డైమండ్‌తో కూడిన జుమ్కీలు, అలాగే ఒక కేజీ వెండి సామానులను చోరీ చేశారు. ఇంటికి తాళం వేసి బెంగళూరుకు వెళ్లిన క్రమంలో రూపా జయకర్ ఇంట్లో ఈ చోరీ జరిగింది. ఈ నెల 4న తిరిగి వచ్చి చూడగా చోరీ వెలుగు చూసింది. అలాగే బ్యాంక్ రికార్డులు, రూ.8 వేల నగదు, పలు వివరాలతో ఉన్న నాలుగు హార్డ్‌డిస్క్‌లు కూడా చోరీ అయినట్లు అశోక్ నగర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రూపా జయకర్ తెలిపారు.

10న ప్రతిభా పురస్కారాల ప్రదానం

10న ప్రతిభా పురస్కారాల ప్రదానం

10న ప్రతిభా పురస్కారాల ప్రదానం