
హుబ్లీ రైల్వే జోన్‌లో రైళ్లు మరింత వేగిరం
హుబ్లీ: ప్రతి రైల్వే స్టేషన్‌లో ముఖ్యమైన రైలు మార్గాలు, లూప్‌లైన్లు, అదనపు లైన్లు ఉంటాయి. వీటి కార్య సామర్థ్యం వృద్ధి చేయడం ద్వారా రైళ్ల సంచార కార్యాచరణ, దక్షత వేగం పెంపులో నైరుతి రైల్వే దూసుకుపోతోంది. ఇప్పటికే వెయ్యికి పైగా కిలోమీటర్ల మేర ట్రాక్‌ల్లో రైలు సంచార వేగాన్ని పెంచింది. ఓ గంట పాటు సమయం దీంతో అదా కానుంది. వీటితో పాటు మార్గాల్లో రైలు వేచి ఉండటం వల్ల సంచారంలో జాప్యం ప్రమాణాలు తగ్గనున్నాయి. జోన్ పరిధిలో ఇప్పటి వరకు లూప్‌లైన్లలో వేగ పరిమితి గంటకు 15 కిలో మీటర్లు ఉండేది. ప్రస్తుతం గంటకు 30 కిలో మీటర్లకు పెంచారు. అలాగే బెంగళూరు విభాగంలో 591 కిలోమీటర్ల మేర ట్రాక్‌ల ఆధునీకరణ, లూప్‌లైన్‌లో వేగం పరిమితి పెంపు ఫలితంగా 41 నిమిషాల సమయం ఆదా అయింది. ఆ మేరకు 281 కిలోమీటర్ల ఆధునిక ట్రాక్‌లో వేగాన్ని గంటకు 110 నుంచి 130 కిలో మీటర్లు, అలాగే 495 కిలో మీటర్ల ట్రాక్‌లో 100 నుంచి 110 కిలోమీటర్లకు పెంచారు. హుబ్లీ విభాగంలోని ప్రముఖ 10 స్టేషన్లలో 12 లూప్‌లైన్లు, అలాగే 135 కిలో మీటర్ల సామర్థ్య వృద్ధి ఫలితంగా 12 నిమిషాల సమయం ఆదా అయింది.
మైసూరు డివిజన్‌లో కూడా..
మైసూరు విభాగంలో 135 కిలోమీటర్లలో వేగ పరిమితిని గంటకు 70 నుంచి 80 కి.మీ.లకు పెంచడానికి దోహద పడింది. దీంతో సరుకు రవాణా, ప్రయాణికుల రైళ్ల సంచారం రెండింటికీ ప్రయోజనం అయింది. ఈ విషయమై రైల్వేజోన్ సీపీఆర్ డాక్టర్ మంజునాథ కనుమడి మాట్లాడుతూ 2024–25వ సంవత్సర గడువులో 835 కిలో మీటర్ల మేర ట్రాక్ 110–130 కిలోమీటర్ల వేగానికి ఆధునికీకరించారు. దీంతో 24 నిమిషాల సమయం ఆదా కానుంది. 2024లో సుమారు 60 నిమిషాల పాటు ఆదా చేశారు. హుబ్లీ విభాగంలో 13 నిమిషాలు, బెంగళూరులో 40 నిమిషాలు, మైసూరు విభాగంలో 6 నిమిషాలు సమయం ఆదా అయింది. మొత్తం మీద నైరుతి రైల్వే జోన్‌లో 384 రైల్వే స్టేషన్లు ఉండగా 3,692 కిలో మీటర్ల నెట్‌వర్క్ కలిగి ఉంది. వీటిలో రోజు సుమారు 400 ప్యాసింజర్ రైళ్లు సంచరిస్తున్నాయి. లూప్‌లైన్లలో వేగ ప్రమాణం వృద్ధి చేయడంతో ప్రధాన మార్గాల్లో గరిష్టంగా అనుమతించిన వేగాన్ని పెంచడానికి సహాయ పడింది. అలాగే గూడ్స్ రైళ్లు అత్యధిక వేగంతో సంచరించడం ద్వారా నిర్ధిష్ట సమయానికి సరుకు చేరవేయడానికి, ఆర్థిక పురోగతికి ఉత్తేజాన్ని ఇచ్చింది.
లూప్‌లైన్, ట్రాక్‌ల కార్య సామర్థ్య వృద్ధి
వెయ్యికి పైగా కి.మీ.మేర రైళ్ల వేగం పెంపు