
బళ్లారిలోనే మెగా డైరీ నిర్మాణం
సాక్షి, బళ్లారి: బళ్లారిలో మెగా డైరీ నిర్మించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు, ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అపోహలు వద్దని గ్రామీణ ఎమ్మెల్యే నాగేంద్ర పేర్కొన్నారు. ఆయన శుక్రవారం నగరంలోని కేఎంఎఫ్ కార్యాలయంలో జరిగిన రాబకొవి పాలక మండలి సర్వసభ్య సమావేశంలో రాబకొ అధ్యక్షుడు రాఘవేంద్ర హిట్నాల్, నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి తదితరులతో కలిసి ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. బళ్లారి తాలూకా కొళగల్లు ప్రాంతంలో ముందుగా నిర్ణయించిన ప్రకారం రూ.84 కోట్ల కేఎంఆర్‌సీ నిధులతో దేశంలోనే పేరుగాంచే విధంగా మెగా పాలడైరీని నిర్మిస్తామని అన్నారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని బళ్లారిలో మెగా డైరీని అత్యద్భుతంగా నిర్మించి, ఈ ప్రాంతంలో రైతులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పాడి రైతులకు ఇతోధికంగా మేలు జరుగుతుందన్నారు. తద్వారా ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు. గుజరాత్‌లో అమూల్ కంపెనీకి దీటుగా ఇక్కడ మెగా డైరీ చేపడతామన్నారు.
పాడి పరిశ్రమ అభివృద్ధికి ఊతం
బళ్లారిలో పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడంతో పాటు రైతులకు, వ్యాపారులకు, వినియోగదారులకు అందరికీ ప్రయోజనం చేకూరే విధంగా చూస్తామన్నారు. పశుసంవర్ధక శాఖ నుంచి 11 వేల ఆవులను, గేదెలను రైతులకు పంపిణీ చేస్తామన్నారు. రైతుల ఆర్థిక స్థితి మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాబకొవి పరిధిలో 2 లక్షల పాల సేకరణే లక్ష్యంగా పని చేస్తామన్నారు. బళ్లారి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా జమీర్‌ఖానే ఉంటారని, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున మంత్రి రహీంఖాన్ జెండా ఎగర వేస్తారన్నారు. అనంతరం రాయచూరు, బళ్లారి, కొప్పళ, విజయనగర(రాబకొవి) పాల సమాఖ్య అధ్యక్షుడు రాఘవేంద్ర హిట్నాళ్ మాట్లాడుతూ రాబకొవి పాల సమాఖ్య ఉత్పత్తులను పెంచి ఈ ప్రాంతంలో రైతులకు మేలు చేయడంతో పాటు నాణ్యమైన, నమ్మకమైన పాలను అందజేస్తామన్నారు. ఈసందర్భంగా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
2 లక్షల లీటర్ల పాల సేకరణ లక్ష్యం
మాజీ మంత్రి, ఎమ్మెల్యే బీ.నాగేంద్ర