
యువనిధి ప్లస్‌తో యువతకు సాధికారత
హొసపేటె: యువతను ప్రోత్సహించడానికి, యువనిధి పథకం ద్వారా వివిధ నైపుణ్య ఆధారిత శిక్షణను అందించడానికి, స్వతంత్ర జీవితాన్ని కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం యువనిధి ప్లస్ పథకాన్ని అమలు చేసిందని, యువత, మహిళలు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పథకం అమలు ప్రాధికార సంస్థ జిల్లా అధ్యక్షుడు కురి శివమూర్తి తెలిపారు. గురువారం నగరంలోని టీఎంఏఈఎస్ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన యువనిధి, యువనిధి ప్లస్ పథకాలపై ఒక రోజు సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువనిధి పథకం కింద విద్యార్థులు పేర్లు నమోదు చేసుకుని ఆర్థిక సహాయం పొందేందుకు మాత్రమే కాకుండా నిరుద్యోగ సమస్యను తొలగించి వారు స్వంత ఉద్యోగాలను సృష్టించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆలోచనలతో యువనిధి ప్లస్‌ను ప్రారంభించిందన్నారు.
జిల్లాలో 8,007 మంది పేర్ల నమోదు
ఇప్పటికే జిల్లాలో 8,007 మంది లబ్ధిదారులు యువనిధి పథకం కింద పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. ప్రస్తుతం 109 మంది అభ్యర్థులకు ప్రభుత్వ సంస్థలు నైపుణ్య శిక్షణ అందిస్తున్నాయన్నారు. దశల వారీగా అభ్యర్థులందరికీ నైపుణ్య శిక్షణ అందిస్తారన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రం అధికారి పీఎన్.హట్టప్ప, జిల్లా స్థాయి హామీ పథకాల అమలు ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ హెచ్.జాండీసాహెబ్, సంస్థ సభ్యుడు పీహెచ్.దేవరాజ్, టీఎంఏఈఎస్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ హెచ్.శంకరానంద, టీఎంఏఈఎస్ ఐటీఐ కళాశాల వైస్ ప్రిన్సిపల్ టీ.నజీరుద్దీన్, ప్రిన్సిపాల్ రేవణ సిద్దప్ప, విద్యార్థులు పాల్గొన్నారు.