ఘరానా ఇంటి దొంగ అరెస్ట్
హుబ్లీ: ఇళ్లలో చోరీలకు పాల్పడే ఘరానా ఇంటి దొంగను బెండిగేరి పోలీసులు అరెస్ట్ చేయడంలో సఫలీకృతులయ్యారు. అతని నుంచి మొత్తం 62 గ్రాముల బంగారం, 310 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. హుబ్లీ దొడ్డమని కాలనీ నివాసి అమన్ బేపారి (24) అరెస్ట్ అయిన నిందితుడు. సదరు స్టేషన్ పరిధితో పాటు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిల్లో ఈ దొంగ పగలు రాత్రి అనే తేడా లేకుండా తన చేతివాటం చూపాడు. అలా నాలుగు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఇతడి నుంచి సుమారు రూ.6.10 లక్షల విలువ చేసే వివిధ ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బెండిగేరి సీఐ ఎస్‌ఆర్ నాయక్, ఎస్‌ఐ రవి వడ్డర, సిబ్బంది నీలగార, అంబిగేర, కరగాంబి, అరకి, గళగి, మేటి, ఇత్తలమని, వాళికార, వగ్గనవర దాడిలో పాల్గొన్నారు.
వేర్వేరు చోట్ల చోరీలు
రెండు చోట్ల వేర్వేరుగా చోరీలు జరిగాయి. అమరగోళ ఏపీఎంసీ యార్డ్‌లో జేకే ట్రేడర్స్ అంగడి షట్టర్ తాళాలను పగలగొట్టి రూ.72 వేల నగదు, రూ.85 వేల విలువైన 6 సీసీ కెమెరాలు, మానిటర్, లెనోవో కంప్యూటర్‌ను చోరీ చేశారు. కేవల్‌చంద్ సోలంకికి చెందిన అంగడిలో ఈనెల 23న రాత్రి చోరీ జరిగినట్లు నవనగర ఏపీఎంసీ పోలీసులు కేసు నమోదు చేశారు. మరో ఘటనలో విద్యానగర్ అమృత టాకీస్ వెనుక ఉన్న ఇంటికి వేసిన తాళాన్ని పగలగొట్టి లోనికి వెళ్లి రూ.30 వేల నగదు, రూ.10 వేల విలువ చేసే బంగారు ఆభరణం చోరీ చేసిన కేసులో రేష్మా అనే మహిళ విద్యానగర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో అంజాద్ పఠాన్‌పై కేసు నమోదైంది.
రోటవేటర్‌కు చిక్కి రైతు మృతి
హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకాలోని మసారి నెల్కుద్రి గ్రామంలో ఓ రైతు ట్రాక్టర్ రోటవేటర్‌లో చిక్కుకుపోయి మరణించాడు. గ్రామానికి చెందిన రైతు పంపాపతి(40) పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. వర్షాలు కురవడంతో పొలం దున్నుతుండగా ట్రాక్టర్ రోటవేటర్‌లో చిక్కుకుని నుజ్జునుజ్జవటం చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు ఇటగి పోలీసులు తెలిపారు.
పాత కక్షలతో యువకుడి హత్య
రాయచూరు రూరల్: పాత కక్షలతో ఓ యువకుడిని హత్య చేసిన ఘటన ఆదివారం రాత్రి నగరంలో చోటు చేసుకుంది. మాణిక్ నగర్‌లో మహ్మద్ గౌస్ ఆరిఫ్(21), ముజాహిద్(21) అనే యువకుల మధ్య ఆరు నెలల క్రితం కొన్ని విషయాల్లో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో చిన్నపాటి గొడవలు జరిగాయి. తాజాగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో పాతకక్షలను మనసులో పెట్టుకున్న మహ్మద్ గౌస్ తన మిత్రులతో కలిసి ఆరిఫ్‌పై దాడి చేసి చాకుతో పొడవడంతో అక్కడికక్కడే మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ చంద్రప్ప తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని ఆయన వెల్లడించారు.
కృష్ణా నదిలో ఒకరు మృత్యువాత
హుబ్లీ: గుహేశ్వర ప్రాంతంలో పశువుల కోసం పచ్చగడ్డి తేవడానికి కృష్ణా నదిలోకి వెళ్లిన ఓ వ్యక్తి నీటి ఉధృతికి మృత్యువాత పడిన ఘటన బాగలకోటె జిల్లా జమఖండి తాలూకా కంకనవాడి గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడిని ఆ గ్రామ నివాసి కల్లప్ప దోరప్ప అంబి(65)గా గుర్తించారు. మృతుడు ఈదుతూ కృష్ణా నదిని దాటడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో నది మధ్యలో భారీ వర్షాలతో వరద నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో మృతి చెందినట్లు జమఖండి రూరల్ పోలీసులు తెలిపారు.
జనౌషధి కేంద్రాల
మూసివేత తగదు
బళ్లారిఅర్బన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో జనౌషధి కేంద్రాలను మూసివేయరాదని రైతు సంఘం నేత శివమూర్తి కేణి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లాధికారి ద్వారా ముఖ్యమంత్రికి రాసిన వినతిపత్రాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల ఆవరణలో జనౌషధి కేంద్రాలను రాష్ట్ర ఆరోగ్య శాఖ మూసివేయాలని నిర్ణయించడం సబబు కాదన్నారు. పేదలకు ఈ ఔషధ కేంద్రాల వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతోందన్నారు. ఎట్టి పరిస్థితిలోను వీటిని తొలగించరాదని ఆయన ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావ్‌కు విజ్ఞప్తి చేశారు.
ఘరానా ఇంటి దొంగ అరెస్ట్


