
ఉడత బెదిరింపులకు బెదిరిపోం
శివాజీనగర: బీజేపీ– ఆర్‌ఎస్‌ఎస్ ఉడత బెదరింపులకు బెదిరిపోం, ఎదుర్కొనే శక్తి నాకు, మా కార్యకర్తలకు ఉందని సీఎం సిద్దరామయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం వల్లనే ధరల పెరుగుదల, దేశ వ్యతిరేక పరిపాలన ఖండన పేరుతో సోమవారం బెళగావిలో కాంగ్రెస్ బృహత్ సభను జరిపింది. ఈ సభను సీఎం ప్రారంభించి మాట్లాడారు. గత 10 సంవత్సరాల నుంచి నిరంతరం ధరలు పెరుగుతున్నాయి. భారతీయులు అలాగే బతుకును లాగుతున్నారు. భారతీయ సమాజాన్ని ఛిన్నాభిన్నం చేస్తూ ప్రజాద్రోహానికి పాల్పడటం మినహాయిస్తే కేంద్ర ప్రభుత్వం ఏమి చేసిందో చూపించాలని డిమాండ్ చేశారు. భారతీయులు బ్రిటీష్‌వారిపై పోరాడి ప్రాణత్యాగం చేసినప్పుడు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఎక్కడ ఉన్నాయని అన్నారు. ఇటీవల కశ్మీర్‌లో అమాయకులైన భారతీయులను, కర్ణాటకకు చెందిన ముగ్గురిని ఉగ్రవాదులు దర్జాగా వచ్చి తుపాకులతో హత్య చేసి వెళ్లారు కదా, ఇది కేంద్ర ప్రభుత్వ లోపం కాదా? భారతీయులకు భద్రత కల్పించటంలో విఫలం కావడాన్ని భారతీయులు ప్రశ్నించరాదా? ప్రశ్నిస్తే అడ్డు చెబుతారా అని ధ్వజమెత్తారు. మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు అత్యంత ధనవంతులపై 32 శాతం ట్యాక్స్ ఉండేది. మోదీ వచ్చిన తరువాత 25 శాతానికి తగ్గించారు. పేదలు, మధ్యతరగతి వర్గంపై పన్నులను పెంచారు. సిగ్గు లేదా మీకు. పేదల, మధ్యతరగతి వర్గాల వ్యతిరేక బీజేపీ పరిపాలనను మేము ప్రశ్నించరాదా? భారతీయులను నిరంతరం అబద్ధాలతో మభ్యపెడుతారా. వాస్తవం చెప్పండని దుయ్యబట్టారు. తమకు బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ను ఎదుర్కొనే శక్తి ఉందన్నారు.
బీజేపీ మహిళా కార్యకర్తల హల్‌చల్
బెళగావిలో సీపీఎడ్ మైదానంలో కాంగ్రెస్ సమావేశంలో కలకలం ఏర్పడింది. సిద్దరామయ్య ప్రసంగించే సమయంలో హైడ్రామా సాగింది. కొందరు బీజేపీ కార్యకర్తలు అడ్డగించేందుకు యత్నించారు. సిద్దరామయ్య మాట్లాడడం ఆరంభించగానే సభలో వెనుక కాంగ్రెస్ కార్యకర్తల్లా కూర్చొన్న బీజేపీ మహిళా కార్యకర్తలు నల్ల జెండాలను ప్రదర్శించి, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేయసాగారు. వేదిక వైపు దూసుకువచ్చారు. ఈ సమయంలో అరుపులు, కేకలతో గందరగోళం నెలకొంది. సీఎం సిద్దరామయ్య కొంతసేపు తన ప్రసంగాన్ని నిలిపివేసి, బెళగావి ఎస్పీ ఎవరు? పోలీసులు ఏమి చేస్తున్నారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పోలీసు అధికారిని చెంప మీద కొట్టబోయారు. బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ సమావేశానికి వచ్చి అడ్డగిస్తున్నా మౌనంగా కూర్చొన్నారా? అందరినీ బయటికి పంపాలని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులు బయటకు లాక్కెళ్లారు.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై సీఎం సిద్దు ధ్వజం
బెళగావిలో ధరల వ్యతిరేక సభ
కాషాయ కార్యకర్తల అలజడి
పోలీసులపై సీఎం ఆగ్రహం

ఉడత బెదిరింపులకు బెదిరిపోం

ఉడత బెదిరింపులకు బెదిరిపోం