బాలుని కుటుంబానికి పరామర్శ
హొసపేటె: కొప్పళ జిల్లా స్టేడియంలోని ఈత కొలనులో ఇటీవల మరణించిన బాలుడి ఇంటికి సోమవారం జిల్లా కలెక్టర్ నళిన్ అతుల్ వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కొప్పళ తాలూకా ఇంద్రగి గ్రామానికి చెందిన రామప్ప ఎలెగార్ కుమారుడు ఇంద్రేష్(17) తన స్నేహితులతో కలిసి కొప్పళ జిల్లా స్టేడియంకు వెళ్లి స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొడుతుండగా మునిగిపోయాడు. యువజన సాధికార, క్రీడా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విఠల జబాగౌడర్, మృతుడి తండ్రి రామప్ప ఎలెగార్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
స్థల వివాదంతో వ్యక్తి హత్య
హుబ్లీ: స్థలం వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తిని చాకుతో పొడిచి చంపిన ఘటన ధార్వాడ తాలూకా అమ్మినబావిలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన పరశప్ప శంక్రప్ప హాదిమని(56) హతుడు. అదే గ్రామానికి చెందిన ద్యామప్ప కాళప్ప బడిగేరను నిందితుడిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి పక్కన స్థలం గురించి ఆదివారం రాత్రి జరిగిన గొడవ వికోపానికి దారి తీయడంతో నిందితుడు ద్యామప్ప చాకుతో పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన పరశప్పను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. నిందితుడు ద్యామప్ప పరారయ్యాడు. ఘటన స్థలానికి జిల్లా ఎస్పీ డాక్టర్ గోపాల బ్యాకోడ, డీఎస్పీ నాగరాజ్ వెళ్లి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్టు చేపట్టినట్లు ధార్వాడ గ్రామీణ పోలీసు స్టేషన్ సీఐ ఎస్‌ఎస్ కమతగి తెలిపారు.
మసీదుల్లో ఇమాంలను తొలగించండి
రాయచూరు రూరల్: నగరంలోని మసీదుల్లో అక్రమాలకు పాల్పడుతున్న ఇమాంలను తొలగించాలిని సామాజిక కార్యకర్త ఖాజావలి డిమాండ్ చేశారు. సోమవారం వక్ఫ్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. లోహరవాడిలో ఉన్న మజీద్ ఏ బీబీ హలీమా ఇమాంలు ముబుల్లిగ్, జాఫర్ ఖాన్‌లను తొలగించాలన్నారు. ఇమాంలు ముబుల్లిగ్, జాఫర్ ఖాన్‌లు మసీదులో ఉన్న సమాధులను తొలగించారని, ఇష్టమొచ్చినట్లు మసీదు కార్యకలాపాలను నిర్వహిస్తూ అసభ్యంగా ప్రవర్తించే వారిపై చర్యలు చేపట్టి వారిని తొలగించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్‌కు వక్ఫ్ అధికారి ద్వారా వినతిపత్రం సమర్పించారు.
హైకోర్టు పీఠంలో
ప్రత్యేక లోక్ అదాలత్
హుబ్లీ: ధార్వాడ హైకోర్టు పీఠంలో సీనియర్ న్యాయమూర్తి ఎస్‌జీ పండిట్ నేతృత్వంలో ప్రత్యేక లోక్ అదాలత్ చేపట్టారు. న్యాయమూర్తి ఈఎస్ ఇంద్రేష్, సీ.శ్రీషానంద, సీఎం పూణచ్చ, బీ.బసవరాజ, ఉమేష్ ఎం అడిగ, సభ్యులు గోపాల్ బీ. పాటిల్, సాజిదా గుడదాళ, రాకేష్ బిల్వా, వీపీ వడవి, శ్రీలక్ష్మి పూర్లి, శైల బెళ్లికట్టి నేతృత్వంలో మొత్తం 6 పీఠాలు ఏర్పాటు చేశారు. లోక్ అదాలత్‌లో ప్రమాద పరిహార కేసులతో పాటు ప్రత్యేకించి చెక్ బౌన్స్ కేసులు, 43 రిట్ పిటిషన్లు, సివిల్ రెండు, 5 రిట్ అర్జీలు, గత కొన్నేళ్లుగా పరిష్కారం కాని కేసులను పరిష్కరించారు. అదాలత్‌లో మొత్తం 1274 కేసులను విచారించి 173 కేసులను పరిష్కరించినట్లు హైకోర్టు న్యాయసేవా సమితి ధార్వాడ పీఠం కార్యదర్శి, అదనపు ప్రాసిక్యూటర్ జెరాల్డ్ రుడాల్ఫ్ మెండోన్స ఓ ప్రకటనలో తెలిపారు.
మలేరియా నిర్మూలన
జాగృతి జాతాకు శ్రీకారం
రాయచూరు రూరల్: జిల్లాలో మలేరియా వ్యాధి నిర్మూలనకు సహకరించాలని జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ అధికారి సురేంద్ర బాబు పిలుపునిచ్చారు. ఆయన సోమవారం జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ అధికారి కార్యాలయం ఆవరణలో ప్రపంచ మలేరియా దినోత్సవ జాతాకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మలేరియా వ్యాధి వ్యాప్తి, పరిణామాల గురించి అవగాహన పెంచుకుని నియంత్రణకు ముందుకు రావాలన్నారు.
అభివృద్ధి పనుల పరిశీలన
కోలారు : నగరంలో రూ.75 లక్షల వ్యయంతో నిర్వహిస్తున్న కోలారమ్మ దేవి ఆలయ రోడ్డు అభివృద్ధి పనులను జిల్లాధికారి డాక్టర్ ఎంఆర్ రవి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వారం రోజుల్లోగా రోడ్డు అభివృద్ధి పనులను నాణ్యతగా పూర్తి చేయాలని నగరసభ అధికారులకు సూచించారు. కోలారమ్మ దేవాలయం ముందు ఎలాంటి కుల భేదం లేకుండా ప్రతి ఒక్కరూ దేవాలయంలోకి ప్రవేశించవచ్చనే నామఫలకం వేయించాలన్నారు. కోలారమ్మ దేవాలయ ప్రాంగణంలో స్వచ్చతను కాపాడాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని సౌకర్యాలను అందించాలన్నారు. నగరసభ కమిషనర్ ప్రసాద్, దేవదాయ శాఖ తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
బాలుని కుటుంబానికి పరామర్శ
బాలుని కుటుంబానికి పరామర్శ


