కులాల మధ్య చిచ్చుకు సర్కారు కుట్ర
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన వర్గాలపై ఇచ్చిన నివేదికల్లో వీరశైవ లింగాయతుల జనాభా గణాంకాలను తగ్గించి కులాల మధ్య చిచ్చు పెట్టడానికి చేసిన ప్రయత్నాన్ని ఎలె బిచ్చాలి, మటమారి మఠాధిపతి తప్పుబట్టారు. మంగళవారం నగరంలోని సోమవారపేట హిరేమఠంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేఽశంలో ఆయన మాట్లాడారు. గతంలో 27 శాతం ఉన్న జనాభాను నేడు 11 శాతానికి తగ్గించి వీరశైవ లింగాయతులున్నట్లు నివేదికలో పేర్కొనడం అపహాస్యంగా ఉందన్నారు. దీనిని నిరసిస్తూ ఈనెల 28న జిల్లాలో వీరశైవ సమాజం ఆధ్వర్యంలో పోరాటం చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కులగణన పేరుతో ముఖ్యమంత్రి సిద్దరామయ్య పదవిని కాపాడుకోవడానికి కుట్ర పన్నారన్నారు. రాజకీయ లాభం కోసం కులాల మధ్య చిచ్చు పెట్టడానికి తోడు పదవిని రక్షించుకోవడానికి నాటక మాడుతున్నట్లు తెలిపారు. కులగణనలో సరైన గణాంకాలు లేవన్నారు. తప్పుల తడకగా నివేదికలు అందించారన్నారు. ఏనాడు ఏ అధికారి కులగణన సమీక్షకు రాలేదన్నారు. కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, అభినవ రాచోటి శివాచార్య, పంచాక్షరి, గురుమూర్తి, మహాలింగ, విరుపాక్ష పండితారాధ్య, వీరసంగమేశ్వర, శంభు సోమనాథ, శంభులింగ, పంపాపతి, కేంద్ర మాజీ మంత్రి బసవరాజ పాటిల్ అన్వరి, శాసన సభ్యులు హంపనగౌడ, శివరాజ్ పాటిల్, అధ్యక్షుడు శరణు భూపాల్ నాడగౌడ, బసనగౌడ, చంద్రశేఖర్, షణ్ముకప్ప, మల్లికార్జున, విజయ్ కుమార్‌లున్నారు.
28న జిల్లాలో వీరశైవ సమాజంచే పోరాటం


