బళ్లారిటౌన్: మనిషికి నయనం ప్రధానం అని, కళ్లు దెబ్బతినకుండా వాటి ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలని సిటీ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం గాంధీనగర్‌లోని రేణుకా కిచెన్ ఎదురుగా నూతనంగా నిర్మించిన అగర్వాల్ ఐ హాస్పిటల్ ప్రారంభ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నేటి జీవన శైలిలో మనిషిపై ఒత్తిడి పెరుగుతున్నందున నేత్ర సమస్యలు ఎక్కువవుతున్నాయన్నారు. ఈ దిశలో రాష్ట్రంలో పేరుగాంచిన అగర్వాల్స్ ఐ హాస్పిటల్‌ను బళ్లారిలో కూడా ప్రారంభించడం శ్లాఘనీయం అన్నారు. ప్రభుత్వ పథకాల కింద మంజూరయ్యే కంటి ఆపరేషన్లను కూడా పేదలకు ఆస్పత్రిలో చేసేలా మున్ముందు ఆసక్తి చూపాలన్నారు. హాస్పిటల్ సీనియర్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ హాస్పిటల్ రాష్ట్రంలో బళ్లారితో కలిపి 28 కేంద్రాలను ప్రారంభించిందన్నారు. 220కి పైగా ప్రపంచ స్థాయి అన్ని సదుపాయాలు ఈ ఆస్పత్రిలో లభిస్తాయన్నారు. ల్యాబ్, ఆపరేషన్లు, కంటి అద్దాలు, ఇతర సదుపాయాలు కూడా ఆస్పత్రిలో ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లాధికారి ప్రశాంత్‌కుమార్ మిశ్రా, అడిషనల్ ఎస్పీ రవికుమార్, డీహెచ్‌ఓ వై.రమేష్‌బాబు, డాక్టర్ మహేష్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.