సాక్షి,బళ్లారి: యాదగిరి జిల్లాలో కారు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మంగళవారం రాత్రి యాదగిరి జిల్లా సురపుర తాలూకా చామనాళ్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంలో వెళుతుండగా ఎదురుగా కారు అతి వేగంగా రాగా ముఖాముఖి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై సురపుర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మాకు ప్రాణ రక్షణ కల్పించండి
రాయచూరు రూరల్: మాజీ నగరసభ సభ్యుడి నుంచి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని దాడికి గురైన కుటుంబం జిల్లా ఎస్పీకి మొర పెట్టుకుంది. మంగళవారం రాత్రి దేవినగర్‌లో పునీత్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమాలను వాట్సప్‌లో అప్‌లోడ్ చేయడాన్ని తొలగించాలని మహేష్ అనే యువకుడికి 28వ వార్డు మాజీ కౌన్సిలర్ తిమ్మారెడ్డి, భార్య కవిత, కొడుకు సంతోష్‌లు మహేష్ ఇంటికెళ్లి దాడి చేశారు. ఈ విషయంపై బుధవారం బాధితుడు ఎస్పీ పుట్టమాదయ్యకు ఫిర్యాదు చేశారు.
పోలీస్ స్టేషన్‌లో ఇస్పేట్ జూదం
● ఐదుగురు రక్షక భటుల సస్పెండ్
రాయచూరు రూరల్: సమాజంలో అనైతిక కార్యకలాపాలు, మట్కా, జూదం వంటి వాటిని అణగదొక్కాల్సిన రక్షక భటులే పోలీస్ స్టేషన్‌లో ఇస్పేట్ జూదం ఆడిన ఘటన కలబుర్గి జిల్లాలో చోటు చేసుకుంది. కలబుర్గి జిల్లా చిత్తాపుర తాలూకా వాడి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐ మహ్మద్ మియా, హెడ్ కానిస్టేబుళ్లు నాగరాజ్, సాయిబణ్ణ, ఇమామ్, పోలీస్ కానిస్టేబుల్ నాగభూషణ్‌లు రాత్రి వేళ స్టేషన్‌లో పేకాట ఆడుతూ కూర్చున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. కలబుర్గి జిల్లా ఎస్పీ శ్రీనివాసులు వాడి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ తిరుమలేష్‌కు నోటీసులు జారీ చేశారు. బుధవారం ఎస్పీ శ్రీనివాసులు, ఏఎస్‌ఐ మహ్మద్ మియా, హెడ్ కానిస్టేబుళ్లు నాగరాజ్, సాయిబణ్ణ, ఇమామ్, పోలీస్ కానిస్టేబుల్ నాగభూషణ్‌లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
కారు, బైక్ ఢీ.. ఇద్దరు మృతి