
చురుగ్గా వ్యవసాయ కార్యకలాపాలు
హొసపేటె: విజయనగర జిల్లాలోని వివిధ గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పొలం పనుల్లో నిమగ్నులయ్యారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతుల ముఖాల్లో చిరునవ్వు నిండింది. మండు వేసవితో విసిగి వేశారిన రైతులు వర్షం కోసం ఆకాశం వైపు దిక్కులు చూస్తూ కూర్చున్నారు. నీటి కొరతతో వ్యవసాయ పనులు చేయలేక రైతులు కుంగిపోయారు. వర్షం కురుస్తుందని ఆశించిన రైతులు పొలాలను పదును చేసి, పొలాన్ని దున్ని, ఎరువును చల్లి, నాట్లు వేసేందుకు భూమిని సిద్ధం చేసుకొని వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. గత రెండు మూడు నెలలుగా హొసపేటె, కూడ్లిగి, హగరిబొమ్మనహళ్లి, హడగలి, కొట్టూరు తాలూకాలో ఐదు రోజుల క్రితం కురిసిన ముందస్తు వర్షాలతో వ్యవసాయ పనులకు అనుకూలంగా మారింది.