బాలికల హాస్టల్లో తనిఖీ

- - Sakshi

గౌరిబిదనూరు: నగరంలోని వెనుక బడిన వర్గాల సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని బాలికల ప్రభుత్వ హాస్టలును తహశిల్దారు మహేశ్‌ పత్రి తనిఖీ చేశారు. హాస్టలులో వండుతున్న ఆహారం నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్వ నియమాల ప్రకారం బాలికలకు ఆహారం అందజేయాలని, సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని విద్యార్థినులకు సూచించారు. హాస్టల్లో విద్యుత్‌ సమస్యను ప్రస్తావించగా, రెండు రోజులలోగా పరిష్కరిస్తామన్నారు. హాస్టల్‌ వార్డన్‌లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వ్యసనాల జోలికి వెళ్లొద్దు

గౌరిబిదనూరు: వాల్మీకి నాయక వర్గంలోని యువత చెడు వ్యసనాలకు బానిసలు కారాదని, విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని వాల్మీకి నాయక సామాజిక వర్గం స్వామీజీ బ్రహ్మానంద పురి స్వామీజీ తెలిపారు. తొండేబావి గ్రామంలో వాల్మీకి భవనం ప్రారంభించి మాట్లాడారు. విద్యారంగంలో సౌలభ్యాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. దురలవాట్ల జోలికి వెళ్ళరాదన్నారు. ఎమ్మెల్యే పుట్టస్వామిగౌడ మాట్లాడుతూ వాల్మీకి భవనం ఇప్పటికి సాకారమైందన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రముఖులు ఆర్‌ అశోక్‌కుమార్‌, బాబణ్ణ, గంగప్ప, కాంతరాజు, నాగరాజప్ప పాల్గొన్నారు.

హైటెక్‌ పశువుల

ఆస్పత్రి ప్రారంభం

దొడ్డబళ్లాపురం: సీనియర్‌ నటి లీలావతి నెలమంగల తాలూకా సోలదేనహళ్లి వద్ద నిర్మించిన హైటెక్‌ పశువుల ఆస్పత్రిని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ మంగళవారం ఉద్ఘాటించారు. నటి లీలావతి ఇదే ప్రాంతంలో ఒక ఆస్పత్రిని కూడా నిర్మించారు. పశువుల ఆస్పత్రి కూడా నిర్మించాలనేది ఆమె కల. ఆమె కల ఇన్నాళ్లకు నెరవేరింది. అంతకంటే ముందు డీకే శివకుమార్‌ లీలావతి ఇంటికి వెళ్లి ఆమె ఆరోగ్యం గురించి కుమారుడు వినోద్‌రాజ్‌తో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నెలమంగల ఎమ్మెల్యే ఎన్‌ శ్రీనివాస్‌ ఉన్నారు.

ఘనంగా కన్నడ రాజ్యోత్సవం

బొమ్మనహళ్లి: కన్నడనాడులో ఉన్న ప్రతిఒక్కరు కూడా కన్నడ ప్రజలే అని, అలాంటి కన్నడనాడులో ఉన్న వారు కన్నడ భాషాభివృద్ధి కోసం, కన్నడనాడు కోసం పాటుపడాలని సమాజ సేవకుడు, జై కర్ణాటక సంఘం బొమ్మనహళ్లి విభాగం సీనియర్‌ నాయకుడు ఆర్‌. నాగేష్‌ అన్నారు. మంగళవారం నగరంలోని బొమ్మనహళ్లిలోని బీడీఏ కాంప్లెక్స్‌ ఆవరణంలో కన్నడ సమృద్ధి సంఘం క్యాబ్‌ డ్రైవర్లు, యజమానుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కన్నడ రాజ్యోత్సవం, పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌కు నివాళి కార్యక్రమంలో పాల్గొని కన్నడ పతాకాన్ని ఎగురవేశారు. అంతకు ముందు కన్నడ మాత భువనేశ్వరికి పూజలు చేశారు. ఈ సందర్భంగా హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌లో ఉన్న సమర్థనం ట్రస్టు విద్యార్థులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్‌ఎస్‌ఆర్‌ ట్రాఫిక్‌ ఇన్స్‌పెక్టర్‌ రాజ్‌కుమార్‌తో పాటు పెద్ద సంఖ్యలో కన్నడ సమృద్ధి సంఘం క్యాబ్‌ డ్రైవర్‌లు, యజమానులు పాల్గొన్నారు.

సిద్ధుకు కుమార స్వామి అభినందనలు

యశవంతపుర: ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం నిర్వహించిన జనతా దర్శన్‌ను మాజీ సీఎం జన స్పందనగా అభివర్ణించారు. అయన మంగళవారం మడికేరి తాలూకా హకత్తూరులో విలేకర్లతో మాట్లాడారు. సీఎం అధికారులను పిలిపించుకుని ప్రజల సమస్యలు తెలుసుకోవటం అభినందనీయమన్నారు. మరో మూడు నెలలో మళ్లీ జనస్పందన నిర్వహిస్తామని చెప్పటం అంటే అధికారుల పనితీరు సిద్దుకు అర్థమై ఉంటుందన్నారు. తాను సీఎంగా ఉన్న సమయంలో జనతా దర్శన్‌ను ఉదయం 9 గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు నిర్వహించేవాడినని గుర్తు చేశారు.

దొడ్డమ్మ దేవికి విశేష పూజలు

బొమ్మనహళ్లి: కార్తీకమాసం రెండో సోమవారం సందర్భంగా బొమ్మనహళ్లి పరిధి హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌ ఇబ్బలూరు గ్రామంలో వెలసిన గ్రామ దేవత దొడ్డమ్మ దేవికి సోమవారం రాత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళలు ఆలయంలో దీపాలను వెలిగించారు.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top