
వినతిపత్రం సమర్పిస్తున్న దృశ్యం
రాయచూరు రూరల్: జిల్లాలో సరైన వర్షాలు కురవనందున తాగునీటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని జిల్లాధికారి చంద్రశేఖర్ నాయక్ అధికారులకు సూచించారు. బుధవారం తన కార్యాలయంలో గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్ సమక్షంలో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరందక పంటలు ఎండిపోయామన్నారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి అధికం కాకుండా ముందుచూపుతో గణేకల్ రిజర్వాయర్‌లో నీటిని నింపాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులకు నీరు నింపి, భూగర్భ జలాలను పెంపొందించాలన్నారు. తాగునీటి విషయంలో అశ్రద్ధ వహించకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
రిమ్స్ ఆసుపత్రిలో మౌలిక
సౌకర్యాలు కల్పించరూ..
రాయచూరు రూరల్: రాయచూరు ప్రభుత్వ వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) కళాశాలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని జయ కర్ణాటక రక్షణ వేదిక డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనను ఉద్దేశించి జిల్లాధ్యక్షుడు చెన్నయ్య స్వామి మాట్లాడారు. రోగులకు సరైన చికిత్స లభించడం లేదని, వీల్ చెయిర్లు లేక రోగులను తీసుకెళ్లడానికి ఇబ్బందిగా మారిందన్నారు. రిమ్స్ ఆస్పత్రి అభివృద్ధి గురించి పట్టించుకొనే వారు లేరని, సంబంధిత శాఖా మంత్రి రిమ్స్‌లో సౌకర్యాలు కల్పించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.