తిమ్మప్ప భక్తుల ఉగ్రరూపం
మండ్య: మండ్య జిల్లా మద్దూరు తాలూకా ఆబలవాడి గ్రామానికి చెందిన తోపిన తిమ్మప్ప ఆలయాన్ని దేవదాయ శాఖ ఆధీనంలోకి తీసుకునేందుకు వచ్చిన తహసీల్దార్, దేవదాయ శాఖ అధికారులను గ్రామస్తులు, భక్తులు అడ్డుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. హైకోర్టు ఆదేశాల మేరకు తహసీల్దార్ పరశురామ సత్తిగేరి, శాఖ అధికారులు ఆలయం లోపలకు వెళ్లి దేవదాయ శాఖ హుండీని పెట్టేందుకు నడుం బిగించగా భక్తులు, గ్రామస్తులు అధికారులకు సాయంత్రం 7 గంటల నుంచి సుమారు మూడు గంటలకు పైగా అడ్డుకొని దిగ్బంధించారు. అధికారుల మీద ఆలయ ట్రస్ట్ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు కలిసి తిరగబడ్డారు.
ఏం జరిగిందంటే..
తిమ్మప్ప ఆలయాన్ని ట్రస్ట్ పదాధికారులు నిర్వహణ చేస్తుండేవారు. ఇటీవల ట్రస్ట్ మాజీ అధ్యక్షుడు నీలకంఠ, శివనంజయ్య అనే ఇద్దరు గుడికి చెందిన 8 అడుగుల స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు కట్టుకున్నాడు. కొందరు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఇంటిని నేలమట్టం చేశారు. ఈ ద్వేషం నేపథ్యంలో నీలకంఠ ఈ ఆలయాన్ని దేవదాయ శాఖకు అప్పగించాలని రాష్ట్ర హైకోర్టులో దావా వేశారు. ఆ మేరకు అధికారులు గుడిని స్వాధీనానికి ప్రయత్నించగా భక్తులు ప్రతిఘటించారు. తరువాత తహసీల్దార్ సత్తిగేరి తిమ్మప్ప మాట్లాడుతూ ఆలయం సీ గ్రేడ్ పరిధిలోకి వచ్చిందని, రాబోయే రెండు రోజుల్లో దేవదాయ శాఖ పరిధిలోకి తీసుకోవడం తథ్యమని చెప్పారు. మళవళ్లి డీఎస్పీ యశవంత్ కుమార్, మద్దూరు గ్రామీణ స్టేషన్ సీఐ నారాయణి, కొప్ప పీఎస్‌ఐ భీమప్ప బాణసి గట్టి బందోబస్తు నిర్వహించారు.
తోపిన తిమ్మప్ప ఆలయ స్వాధీనానికి అధికారుల ప్రయత్నం
అడ్డుకున్న గ్రామస్తులు, భక్తులు


