బ్యాంక్ దోపిడీకి విఫలయత్నం
హుబ్లీ: బ్యాంక్ దోపిడీకి విఫలయత్నం చేసిన ఘటన ధార్వాడ జిల్లా నవలగుంద తాలూకా శిరూరు గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఆ గ్రామంలోని ఎస్‌బీఐ బ్యాంక్‌లో దోపిడీకి దుండగులు తీవ్రంగా ప్రయత్నించారు. బ్యాంక్‌లో రూ.5 కోట్ల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలతో పాటు రూ.11 లక్షల నగదు ఉండింది. దుండగులు బ్యాంక్ వెనుక గోడ పగలగొట్టే ప్రయత్నం చేశారు. కొద్ది మేర గోడ పగలగొట్టిన తర్వాత శబ్దాలు ఎక్కువ కావడంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఉదయం బ్యాంక్ సిబ్బంది విధులకు రాగా ఘటన వెలుగు చూసింది. నవలగుంద పోలీసులు పోలీసు జాగిలంతో ఘటన స్థలానికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు.
దోపిడీ దొంగల అరెస్ట్‌కు తీవ్రంగా గాలిస్తున్నట్లు, నవలగుంద స్టేషన్‌లో కేసు నమోదు చేసుకొని ప్రత్యేకంగా దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
ఖాతాదారుని ఫిర్యాదుతో..
ఘటనపై ఆ బ్యాంక్ మేనేజర్ వినోద్‌కుమార్ కాంబ్లె మాట్లాడుతూ సోమవారం రాత్రి 8 గంటలకు బ్యాంక్ తలుపులు వేసి ఇంటికి వెళ్లాం. ఉదయం ఎప్పటిలానే పనిలో పడ్డాం. అప్పుడు ఓ ఖాతాదారుడు బ్యాంక్ వెనుక గోడను ఎవరో పలుగు(గడ్డపార)తో పగులగొట్టేందుకు ప్రయత్నించారు, వచ్చి చూడండి అని తెలుపగా తక్షణమే అప్రమత్తమైన మేనేజర్ పరిశీలించానని, అది దొంగలు చేసిన ప్రయత్నమేనని గ్రహించి నవలగుంద పోలీస్ స్టేషన్ సీఐకు ఫోన్ చేసి వివరాలు తెలిపానన్నారు. ఆ మేరకు పోలీసులు వచ్చిన ఘటన స్థలాన్ని పరిశీలించి సీఐ మరో పోలీస్ అధికారి క్షుణ్ణంగా ఆరా తీసి కేసు నమోదు చేసుకున్నారు.
నగదు, ఆభరణాలు చోరీ కాలేదు
సోమవారం బ్యాంక్‌లో రూ.11 లక్షల నగదు నుంచి దాంతో రూ.5 కోట్లు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయి. ఏదీ చోరీ జరగలేదు. గోడను ధ్వంసం చేసి వెళ్లారు. ప్రస్తుతం ఎవరిపై కూడా అనుమానం లేదు. నేను ఇక్కడికి వచ్చే ముందు సెక్యూరిటీ గార్డ్ ఉన్నారని, నేను 2024లో ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు.సెక్యూరిటీ గార్డ్ ఉండేవారు కాదు. తమ బ్యాంక్‌కు సెక్యూరిటీ గార్డ్‌ను నియమించాలని ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేయగా సోమవారం రాత్రి నుంచే సెక్యూరిటీ గార్డ్ నియామకానికి ఆదేశాలు ఇవ్వడంతో ఆ రాత్రి నుంచి సెక్యూరిటీ గార్డ్‌తో బందోబస్తు ఏర్పాటు చేశామని బ్యాంక్ మేనేజర్ వివరించారు.
శిరూరు ఎస్‌బీఐ శాఖలో వెలుగులోకి
ధార్వాడ జిల్లా నవలగుందలో ఘటన


