2026.. ఆనందోత్సాహాల జోరు
బనశంకరి: 2025 సంవత్సరానికి వీడ్కోలు పలికి 2026 న్యూ ఇయర్‌కు బెంగళూరువాసులు ఆనందోత్సాహాలతో స్వాగతం పలికారు. తీపి, చేదుల మిశ్రమమైన గత ఏడాదిని భారమైన హృదయంతో సాగనంపి, కొత్త ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరానికి స్వాగత తివాచీని పరిచారు. అర్ధరాత్రి 12 గంటలు కాగానే హ్యాపీ న్యూ ఇయర్ అని సంతోషంతో కేకలు వేస్తూ కేక్ కటింగ్‌లు చేశారు. యువతీ యువకులు శుభాకాంక్షలు చెప్పుకుని చిందులు వేశారు.
పటిష్ట బందోబస్తు
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నగరవ్యాప్తంగా పటిష్ట పోలీస్ భద్రత కల్పించారు. సంబరాలు ఆకాశాన్నంటిన ఎంజీరోడ్డు, బ్రిగేడ్ రోడ్డు, చర్చ్ స్ట్రీట్ , కమర్షియల్ స్ట్రీట్, కోరమంగల తదితర ప్రాంతాలు విద్యుత్ దీపాలంకరణతో ప్రత్యేక శోభ సంతరించుకున్నాయి. ఈ ప్రదేశాల్లో ప్రజల రద్దీ తారాస్థాయికి చేరింది.
నగరవ్యాప్తంగా 20 వేలకు పైగా పోలీస్ సిబ్బందిని నియమించారు. రోడ్లకు ఇరువైపులా బారికేడ్లను అమర్చారు. 6 వేలకు పైగా సీసీ కెమెరాల ద్వారా అవాంఛనీయాలు జరగకుండా నిఘా వేశారు.
మహిళలకు భద్రత
● యువతులు, మహిళలు సురక్షతకు పోలీసులతో పాటు క్యూఆర్‌టీ, చెన్నమ్మ బలగాల సిబ్బందిని నియమించారు.
● మహిళా బౌన్సర్లను సైతం పోలీసులు మోహరించారు. అస్వస్థతకు గురైన మహిళలను విశ్రాంతిగా ఉంచేందుకు సేఫ్టీ ఐల్యాండ్లను నిర్మించారు.
తెల్లవారేవరకూ రవాణా వ్యవస్థ
ఉత్సవాలకు వచ్చిన ప్రజలు సులభంగా ఇళ్లకు వెళ్లేందుకు తెల్లవారుజామున 2 గంటల వరకు బీఎంటీసీ బస్సులు, 3 గంటల వరకు నమ్మమెట్రో రైలు సేవలు నడిచాయి. అయితే రద్దీ దృష్ట్యా ఎంజీ రోడ్డు, ట్రినిటి మెట్రో రైలు స్టేషన్లను మూసివేశారు. రాష్ట్రంలో అన్ని ప్రధాన నగరాలలో ఇదే మాదిరి వేడుకలు ఉత్సాహభరితంగా జరిగాయి. హ్యాపీ న్యూ ఇయర్ అని సందడి చేశారు.
మందుబాబులకు ఇళ్ల వద్ద
డ్రాపింగ్: హోంమంత్రి
సంబరాలో మద్యం సేవించి నడవలేని వారందరినీ ఇళ్లకు తీసుకెళ్లి వదిలిపెట్టాలని పోలీసులకు హోంమంత్రి పరమేశ్వర్ ఆదేశించారు. బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. బాగా మద్యం తాగిన, నడవలేని స్థితిలో ఉన్న వారిని విశ్రాంతి స్థలంలో వదిలిపెడతాం, సిటీలో 15 చోట్ల రెస్టింగ్ స్థలాలు ఏర్పాటు చేశామని చెప్పారు. మత్తు దిగిన తరువాత ఇళ్ల వద్ద వదలిపెడతామని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఒక దశ వరకు పరిమితి ఉంటుందని, మత్తు హద్దుదాటితే డ్రైవ్ చేయడం కష్టమౌతుంది, ప్రమాదాలు సంభవించి మరణాలు సంభవించడమే కాక ఇతరుల ప్రాణాలు పోతాయన్నారు. 160 ప్రదేశాల్లో ఈ తనిఖీలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఈ రెండురోజుల పాటు కంట్రోల్‌చేస్తే కొందరి ప్రాణాలు మిగులుతాయని తెలిపారు. బార్లు, పబ్‌లు అర్ధరాత్రి 1 గంటకు మూసివేయాలన్నారు. పోలీసులు బాడీ కెమెరాలు ధరించి పనిచేస్తారని, కమాండ్‌సెంటర్‌లో ఆ చిత్రాలు ప్రసారమవుతుంటాయని చెప్పారు.
కొత్త ఏడాదికి ఘన స్వాగతం
హోరెత్తిన బెంగళూరు
ప్రముఖ రోడ్లలో యువత చిందులు
2026.. ఆనందోత్సాహాల జోరు
2026.. ఆనందోత్సాహాల జోరు


