
హోటల్స్‌లో ఆహారాల ధరలకు రెక్కలు రానున్నాయి. పాలు, నిత్యావసరవస్తువులు, కూరగాయలు, గ్యాస్ ధరలు పెరగడంతో హోటళ్ల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది.
బనశంకరి: హోటల్స్‌లో ఆహారాల ధరలకు రెక్కలు రానున్నాయి. పాలు, నిత్యావసరవస్తువులు, కూరగాయలు, గ్యాస్ ధరలు పెరగడంతో హోటళ్ల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. దీంతో బెంగళూరులోని అన్ని హోటల్స్‌లో కాపీ, టీ, అల్పాహారం, భోజనం, చాట్స్‌తో పాటు అన్ని ఆహారపదార్థాలపై 10 శాతం ధర పెంచాలని హోటల్స్ యజమానులు సంఘం తీర్మానించింది.
పెంచిన ధరలు ఆగస్టు 1నుంచి అమలులోకి రానున్నాయి. కాఫీ, టీ ధర రూ.2 నుంచి రూ.3 వరకు, దోసె, ఇడ్లీ, వడ, రైస్‌బాత్, బిసిబెళేబాత్, చౌచౌబాత్ తదితర ఆహారపదార్థాలు ఇప్పడున్న ధరలకు అదనంగా రూ.5 మేర పెరిగే అవకాశం ఉంది. భోజనంపై రూ.5 నుంచి రూ.10 వరకు పెంచాలని బృహత్ బెంగళూరు హోటల్స్ యజమానుల సంఘం తీర్మానించింది.
వినియోగదారులకు భారం లేకుండా ధరలు
నిత్యావసరవస్తువులు, నెయ్యి, నూనె, పన్నీర్, వంట గ్యాస్ ధరలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. హోటల్స్ కార్మికులకు వేతనాలు పెంచాల్సి వస్తోంది. దీనికితోడు అద్దెలు పెరిగాయి. వినియోగదారులపై ఎక్కువ భారం మోపకుండా ధరలు పెంచాలని తీర్మానించాం
– పీసీ.రావ్, హోటళ్ల సంఘం అధ్యక్షుడు
కోవిడ్ నుంచి సమస్య తీవ్రం
కోవిడ్ సమయంలో అనేకమంది కార్మికులు పనులు వదిలిపెట్టి వెళ్లారు. వీరిలో చాలామంది తిరిగిరాలేదు. అధిక వేతనం ఇస్తున్నప్పటికీ కార్మికులు లబించడంలేదు. తోపుడు బండ్లపై భోజనం, టిఫిన్లు పెట్టి అమ్ముతున్నారు. దీంతో హోటల్స్ వ్యాపారాలు పడిపోవడంతో ధరలు పెంచడం అనివార్యమైంది.
– హోటళ్ల యజమానులు