కొండగట్టులో నేటి నుంచి చందనోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

కొండగట్టులో నేటి నుంచి చందనోత్సవాలు

Nov 15 2026 1:14 PM | Updated on Nov 15 2026 1:14 PM

ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు 15 నుంచి 20 వరకు చందనం తొలగింపు ఆర్జిత సేవలు రద్దు.. బాలాలయం ఏర్పాటు నవంబర్‌ 21 నుంచి డిసెంబర్‌ 29 వరకు స్వామివారి నిజరూప దర్శనం రాష్ట్ర నలుమూలల నుంచి తరలిరానున్న వేలాదిమంది భక్తులు

మల్యాల: మల్యాల మండలం ముత్యంపేటలోని శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో 60 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న మహత్తర ఘట్టం చందనోత్సవానికి ముస్తాబైంది. ఈనెల 15 నుంచి 20 వరకు మూలమూర్తి దర్శనం నిలిపివేతతోపాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. భక్తులు బాలాలయంలో స్వామివారి రూపాన్ని దర్శించుకోనున్నారు. యాగశాలలో ప్రధాన ఆలయ కలశంతోపాటు, సుదర్శన చక్రం, శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, అమ్మవారి ఆలయం, ఉత్తర ద్వారం, ఆలయ సింహద్వారంపై ఉన్న కలశాలకు మహా సంప్రోక్షణ, ఇద్దరు జీయర్‌ స్వాములతోపాటు 50మంది రుత్వికులతో నవంబర్‌ 15 నుంచి 20వరకు ఐదు గుండాల హోమాలు నిర్వహించునున్నారు.

తరలిరానున్న వేలాదిమంది భక్తులు

కొండగట్టు ఆంజనేయస్వామి చందనోత్సవాలకు హాజరుకావాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎంపీలకు, ఎమ్మెల్యేలతోపాటు ప్రముఖులకు ఆలయ అర్చకులు, ఈఓ అంజనారెడ్డి ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మంత్రులతోపాటు, ఎమ్మెల్యేలు, నాయకులు, ఎంపీలు తరలివచ్చే అవకాశం ఉంది. చందనోత్సవాలతోపాటు నవంబర్‌ 21 నుంచి డిసెంబర్‌ 29 వరకు 40 రోజులపాటు స్వామివారి నిజరూప దర్శనం చేసుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు.

20 వరకు ఆర్జిత సేవలు నిలిపివేత

చందనోత్సవాల్లో భాగంగా ఈ నెల 15న కార్తీక శుద్ధ షష్ఠి రోజున కళావరోహణం, బాలా లయం ఏర్పాటు, స్వామివారి మూలమూర్తి దర్శనం నిలిపివేత, సాయంత్రం అంకురార్పణ, 16 నుండి 20 వరకు యజ్ఞాది క్రతులు, విశేష పారా యణాలు, అధివాసాలు, అవభృథసాన్నము, ఇద్దరు శ్రీశ్రీశ్రీ త్రిదండి జీయర్‌ స్వాములు విజయవాడ అష్టాక్షరి సంపత్‌కుమార్‌ రామానుజ జీయర్‌, బెంగళూరు వెంకట రామానుజ జీయర్‌ ఆధ్వర్యంలో మహా కుంభాషేకం అనంతరం స్వామివారి మూలమూర్తి దర్శనం ప్రారంభం కానుంది. 40 రోజుల అనంతరం డిసెంబర్‌ 29న స్వామివారికి మండలాభిషేకంతో తొలి విడత చందన లేపనం నిర్వహించనున్నారు.

భక్తులు బాలాలయంలో దర్శనం చేసుకోనున్న స్వామివారి చిత్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement