కరీంనగర్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి అర్జీదారులతో కిక్కిరిసింది. జిల్లాలోని వివిధ మండలాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలపై కలెక్టర్, అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. మొత్తం 231 దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. కాగా.. రేకుర్తి, విద్యానగర్ ప్రాంతాలకు చెందిన 22ఏ నిషేధిత జాబితా భూ బాధితులు సుమారు వందమంది ప్రజావాణికి తరలివచ్చారు. తమ భూములను ఆ జాబితా నుంచి తొలగించాలని పోడియం ఎదుట బైఠాయించారు. ఇంట్లో పెండ్లికి ఎదిగిన ఆడ పిల్లలు ఉన్నారని... పిల్లల పైచదువులు ఆగిపోయాయని పోలీసుల కాళ్లు మొక్కారు. స్పందించిన కలెక్టర్ చిత్రామిశ్రా వారితో తన చాంబర్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రేకుర్తి 22ఏ భూముల సమస్య పరిష్కారానికి సమగ్ర నివేదిక, ప్రతిపాదనలను సీసీఎల్‌ఏకు పంపించినట్లు తెలిపారు. పాత రెవెన్యూ, మున్సిపల్, సర్వే రికార్డులతో పాటు రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలించి నివేదిక రూపొందించామని పేర్కొన్నారు. ఈ సమస్య 50 ఏళ్లుగా కొనసాగుతోందని, శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యమని భరోసా ఇచ్చారు.


