● బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: అఖిలపక్షం
కరీంనగర్ సిటీ: శాతవాహన యూనివర్సిటీ పరిరక్షణ, అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం కోసం ఐక్యంగా ఉద్యమాలు చేపడతామని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ (బీఎస్‌ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు జక్కనపల్లి గణేశ్, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ తెలిపారు. సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘వివాదాల వర్సిటీ’ కథనంపై స్పందించిన అఖిలపక్ష నాయకులు యూనివర్సిటీని సందర్శించి, విద్యార్థులతో మాట్లాడారు. ప్రధాన గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. యూనివర్సిటీలోని చెట్లను తొలగించడం, మట్టిని తరలించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వర్సిటీ అభివృద్ధికి విఘాతం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారని వైస్ చాన్స్‌లర్ ఉమేశ్‌కుమార్‌పై ఆరోపణలు చేశారు. పోలీసు పహారా లో తరగతులు నిర్వహించడం, సమస్యలను ప్రశ్నిస్తున్న విద్యార్థి నాయకులపై కేసులు పెట్టేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. మిగిలిన పీజీ సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.వర్సిటీలో జరుగుతున్న పరిణామాలపై ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్‌యూ జేఏసీ చైర్మన్ కరికె మహేశ్, దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మార్వాడి సుదర్శన్, తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి గుర్రాల రవీందర్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కాంపల్లి అరవింద్, ఎస్‌యూ అధ్యక్షుడు కేశవ్, ఏఐఎస్‌ఎఫ్ కన్వీనర్ శివాజీ పాల్గొన్నారు. ధర్నా నేపథ్యంలో వర్సిటీ గేటు ఎదుట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నాయకులను, గుర్తింపు కార్డులు లేని విద్యార్థులను లోనికి అనుమతించలేదు.


