పైసలిస్తేనే పింఛన్‌! | - | Sakshi
Sakshi News home page

పైసలిస్తేనే పింఛన్‌!

Nov 17 2026 12:14 AM | Updated on Nov 17 2026 12:14 AM

● కొత్త పింఛన్లకు సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ● జిల్లావ్యాప్తంగా 14,834 మందికి లబ్ధి ● ప్రొసీడింగ్‌కు నగరంలో వసూళ్ల పర్వం ● రూ.10వేలు ఇవ్వాలని హుకూం ● అభాగ్యులనూ వదలని కొందరు అధికారులు, కార్పొరేటర్లు

రూ.5 వేల నుంచి రూ.10 వేలు ఇవ్వాల్సిందే!

కరీంనగర్‌ కార్పొరేషన్‌/కరీంనగర్‌ అర్బన్‌: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అర్హులకు చేయూత లభించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్లకు పెద్ద ఎత్తున పింఛన్లు మంజూరు చేయగా సోమవారం నుంచి ప్రొసీడింగ్స్‌ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికుల కేటగిరీలో జిల్లావ్యాప్తంగా 14,834 మందికి కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. అధికారులు పలుమార్లు దరఖాస్తులు స్వీకరించగా, విచారణ అనంతరం అర్హుల జాబితా రూపొందించారు. డీఆర్డీవో ఆధ్వర్యంలో మంజూరు చేస్తున్నారు. కాగా.. పింఛన్‌తో కాసింత ఆసరా దొరుకుతుందని ఆశించిన అభాగ్యులను నగరంలో కొందరు కార్పొరేటర్లు, అధికా రులు వదలడం లేదు. ప్రొసీడింగ్‌ ఇవ్వాలంటే రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్టచెప్పాల్సిందేనంటూ వసూళ్లకు పాల్పడుతున్నారు. నగరంతో పాటు పలు గ్రామాల్లోనూ ఈ దందాకు తెరలేపుతున్నారు.

● కొత్తగా 14,834 మందికి లబ్ధి

జిల్లాలో 1,19,794 మందికి చేయూత పింఛన్లు అందుతున్నాయి. తాజా పెంపుతో 1,34,628 కి చేరింది. కొత్తవారిలో 7,050 మంది వితంతువులు , 1,327 మంది ఒంటరి మహిళలు, దివ్యాంగులు 4,006, చేనేత 379, గీత కార్మికులు 1,503, స్పౌస్‌ కేస్‌ కేటగిరీలో 569మందికి అవకాశం కల్పించారు. పింఛను తీసుకుంటున్న భర్త లేదా భార్య మరణిస్తే భార్య లేదా భర్తకు ఇచ్చే వెసులుబాటు ఇచ్చారు. ఈ నెల నుంచే వారి బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయనున్నారు.

● అత్యధికంగా మానకొండూర్‌

జిల్లాలో 15 మండలాలకు గానూ అత్యధికంగా మానకొండూర్‌ మండలానికి 1,403 పింఛన్లు మంజూరయ్యాయి. తర్వాత స్థానంలో గంగాధర 897, రామడుగు 735, తిమ్మాపూర్‌ 690, శంకరపట్నం 648, వీణవంక 645, సైదాపూర్‌ 642, హుజురాబాద్‌ 603, జమ్మికుంట 552, చిగురుమామిడి 550, చొప్పదండి 490, కరీంనగర్‌ రూరల్‌ 477, ఇల్లందకుంట 428, గన్నేరువరం 364, కొత్తపల్లి 353 మందికి చేయూత పింఛన్లు మంజూరు కాగా, కరీంనగర్‌ కార్పొరేషన్‌లో 3,812, జమ్మికుంట 582, హుజురాబాద్‌ 540, చొప్పదండిలో 423 మంది పింఛన్‌కు అర్హత సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement