మంత్రి పొన్నం ప్రభాకర్
సైదాపూర్‌లో నిర్ధారణ శిబిరం ప్రారంభం
అర్హుల ఎంపికలో అక్రమాలకు పాల్పడితే చర్యలు
సైదాపూర్: హుస్నాబాద్ నియోజకవర్గంలోని దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం ఉచితంగా సహాయక పరికరాలు అందించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమవారం సైదాపూర్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఆలిమ్కో సంస్థ సహకారంతో నిర్వహిస్తున్న నిర్ధారణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ఏడు మండలాలు, హుస్నాబాద్ మున్సిపాలిటీలో విడతలవారీగా శిబిరాలు నిర్వహిస్తామన్నారు. అర్హులకు అవసరాన్ని బట్టి కృత్రిమ అవయవాలు, వినికిడి యంత్రాలు, చేతికర్రలు, వీల్చైర్లు, మూడు చక్రాల వాహనాలు ఉచితంగా అందజేస్తామన్నారు. అర్హులు శిబిరాలకు హాజరై వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అర్హత ఉన్నప్పటికీ పింఛన్లు రాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని, 360 డిగ్రీల పరిశీలన అనంతరం రాజకీయాలకు అతీతంగా పింఛన్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. పరికరాలు, పింఛన్ల మంజూరు కోసం డబ్బులు అడిగే దళారులను నమ్మవద్దని, అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, డీడబ్ల్యూవో సరస్వతి, మార్కెట్ చైర్మన్ దొంత సుధాకర్, ఆలిమ్కో ప్రతినిధులు, సర్పంచులు పాల్గొన్నారు.


