ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థి దుర్మరణం

Nov 15 2026 1:14 PM | Updated on Nov 15 2026 1:14 PM

కోరుట్ల రూరల్‌: మండలంలోని మాదాపూర్‌ శివారులో శనివారం ఆర్టీసీ బస్సు ఢీకొని గ్రామానికి చెందిన డొంకేశ్వర్‌ హేమంత్‌ అలియాస్‌ ప్రశాంత్‌(19) మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం మాదాపూర్‌కు చెందిన డొంకేశ్వర్‌ అశోక్‌– భూమక్క దంపతుల కొడుకు హేమంత్‌ హైదరాబాద్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదువుతున్నాడు. అశోక్‌ ఇటీవల ఇందిరమ్మ ఇల్లు నిర్మించగా.. గృహ ప్రవేశం కోసం స్వగ్రామానికి వచ్చాడు. తన స్నేహితుడు గడ్డం నవీన్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై కోరుట్లకు వెళ్లారు. తిరిగి వస్తుండగా మాదాపూర్‌ శివారులోని రామాలయ వద్ద రాయికల్‌ నుంచి కోరుట్లకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ హేమంత్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. నవీన్‌కు తీవ్ర గాయాలు కాగా కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అశోక్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య

జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని గోవిందుపల్లిలో నివాసం ఉండే రాగుల శ్రీవిజయ (25) కట్నం వేధింపులతో శనివారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మల్యాల మండలం రాంపూర్‌కు చెందిన రాగుల వేణుగోపాల్‌కు నాలుగున్నర సంవత్సరాల క్రితం ఇబ్రహీంపట్నంకు చెందిన శ్రీ విజయను ఇచ్చి వివాహం చేశారు. ఆ సమయంలో 8 తులాల బంగారం, రూ.6 లక్షల నగదు ఇచ్చారు. మూడేళ్ల క్రితం వీరికి పాప జన్మించింది. ఆడపిల్ల పుట్టిందని, అదనంగా మరో రూ.10 లక్షల కట్నం కావాలని భర్త వేణుగోపాల్‌, అత్త భాగ్యలక్ష్మి, ఆడబిడ్డలు కమల, విమల, ఆడబిడ్డ కొడుకు విఘ్నేశ్‌ శ్రీవిజయను నిత్యం వేధింపులకు గురిచేశారు. పలుమార్లు పంచాయితీ పెట్టినా వీరిలో మార్పు రాకపోవడంతో పాటు, వేధింపులు ఎక్కువ అయ్యాయి. మనస్తాపానికి గురై శ్రీవిజయ శనివారం సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి సజ్జనపు నీరజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు జగిత్యాల డీఎస్పీ పురుషోత్తంరెడ్డి తెలిపారు.

ప్రైవేట్‌ టీచర్‌..

వేములవాడ: వేధింపులు భరించలేక రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ముదిరాజ్‌వీధికి చెందిన వివాహిత వేముల శ్రీలత(35) శుక్రవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాలు. శ్రీలత భర్త రాజు ఉపాధి నిమిత్తం దుబాయ్‌లో ఉంటున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు. స్థానికంగా ఓ ప్రైవేట్‌ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తుంది. ఈక్రమంలోనే ఫోన్‌కాల్‌ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. సదరు వ్యక్తి నుంచి ఇటీవల వేధింపులు తీవ్రం కావడంతో భరించలేక శుక్రవారం రాత్రి ఉరివేసుకుంది. గమనించిన స్థానికులు వెంటనే ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్‌ సీఐ వీరప్రసాద్‌ తెలిపారు.

ఆర్టీసీ బస్సులో జేబు దొంగ

ధర్మపురి: ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడి జేబు నుంచి రూ.4వేలు దొంగిలించిన ఓ దొంగ పారిపోయాడు. జగిత్యాల నుంచి మంచిర్యాల వెళ్తున్న టీఎస్‌19టీ9396 నంబర్‌ గల ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు రద్దీగా ఉన్నారు. ధర్మపురి బస్టాండ్‌ నుంచి బయలుదేరిన బస్సులో జాతీయ రహదారి అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి దండేపల్లి మండలం గూడెంకు చెందిన గుండె సత్తయ్య అనే ప్రయాణికుడి జేబులోంచి రూ.4వేలు దొంగిలించి బస్సు నడుస్తుండగానే దూకి పరారయ్యాడు. దొంగను పట్టుకునేందుకు బాధితుడు బస్సు నడుస్తుండగానే దూకగా.. బాధితుడి కాలు టైర్‌ పక్కనే పడి త్రుటిలో ప్రమాదం తప్పింది. వెంటనే లేచి దొంగను పట్టుకునేందుకు నానా ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. పోలీసులు చేరుకొని బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. సీసీ ఫుటేజీలు పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement