కరీంనగర్ అర్బన్: కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచే సంపాదనపరుడిని కోల్పోయినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా అండగా నిలవాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని జిల్లాలో అత్యంత పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి ఈ పథకం ద్వారా రూ.5లక్షల జీవిత బీమా భరోసా అందేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక(గుడ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్) రూపొందించాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పథ కం లక్ష్యాలు, అమలు విధానం, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పంచాయతీ, పట్టణ వార్డుల్లో ప్రజలకు దరఖాస్తు ప్రక్రియలో సహకరించేందుకు ప్రత్యేక హెల్ప్‌డెస్క్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈనెల 19 నుంచి పథకం ప్రారంభం కానున్న నేపథ్యంలో నవంబర్ 20 నుంచి 30 వరకు దరఖాస్తుల స్వీకరణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముంద స్తు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా క్షేత్రస్థాయిలో అధికారులు బాధ్యతతో పని చేయాలని, అర్హులైన ఒక్క కుటుంబం కూడా పథకం పరిధి నుంచి తప్పిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జెడ్పీ సీఈవో శ్రీనివాస్, డీపీవో జగదీశ్వర్, డీఆర్‌డీవో గీత, ఎల్‌డీఎం ఉమాశంకర్, ఇన్‌చార్జి సీపీవో కిషన్‌రావు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


