డెంగీ మహమ్మారికి మరొకరు బలి | - | Sakshi
Sakshi News home page

డెంగీ మహమ్మారికి మరొకరు బలి

Nov 13 2026 12:34 AM | Updated on Nov 13 2026 12:34 AM

● పది రోజుల్లోనే ఇద్దరి మృతి ● భయంతో వణుకుతున్న గొల్లపల్లి

● పది రోజుల్లోనే ఇద్దరి మృతి ● భయంతో వణుకుతున్న గొల్లపల్లి

గొల్లపల్లి: అందరిని నవ్వుతూ పలకరించిన ఆ వ్యక్తి డెంగీ బారిన పడి మృతి చెందాడు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ నిరుపేద కుటుంబంలో డెంగీ మహమ్మారి పెను విషాదం నింపింది. కంటికి రెప్పలా కాపాడుకుంటాడనుకున్న ఇంటి పెద్ద దిక్కు ఆకస్మికంగా దూరమవ్వడంతో ఆ ఇంట రోదనలు మిన్నంటాయి. మండల కేంద్రానికి చెందిన సిరికొండ బుచ్చయ్య (49) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గ్రామంలో అందరితో కలివిడిగా, ఆప్యాయంగా మెలిగేవాడు. రెండురోజుల క్రితం జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు మంగళవారం జగిత్యాలలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు కరీంనగర్‌లోని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి బుచ్చయ్యకు డెంగీ సోకినట్లు నిర్ధారించారు. అప్పటికే ఇన్‌ఫెక్షన్‌ ఊపిరితిత్తులకు వ్యాపించడంతో ఆరోగ్యం క్షీణించింది. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు.

అనాథలైన పిల్లలు.. గుండెలవిసే రోదనలు

బుచ్చయ్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తండ్రి విగతజీవిగా మారడాన్ని పిల్ల్లలు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘మాకు దిక్కెవరు దేవుడా’ అంటూ గుండెలవిసేలా రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. బుచ్చయ్య మరణంతో గొల్లపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వరుస మరణాలతో వణుకుతున్న మండలం

డెంగీతో వారం క్రితం మండలంలోని చందోలికి చెందిన యువకుడు మత్యువాత పడ్డాడు. తాజాగా బుచ్చయ్య మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. పారిశుధ్యం లోపించడంతోనే దోమలు విజృంభిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. వైద్యశాఖ స్పందించి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఫాగింగ్‌ చేపట్టాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement