బోయినపల్లి(చొప్పదండి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలో తాటిచెట్టు నుంచి పడి గీతకార్మి కుడు మృతి చెందాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పల్లెర్ల పెద్ద నారాయణ (58) గీతకార్మికుడు. మంగళవారం సాయంత్రం తాటిచెట్టు ఎక్కి దిగుతుండగా ప్రమాదవశాత్తు మోకు జారి పడ్డాడు. తలకు తీవ్రగాయం కావడంతో చెట్టువద్దనే ప్రాణాలు కోల్పోయాడు. నారాయణ రాత్రి అయినా ఇంటికి రాలేదని కుటుంబసభ్యులు వెతకగా చెట్టు వద్దే మృతి చెంది కనిపించాడు. నారాయణకు భార్య లక్ష్మి, ఆరుగురు కూతుర్లు, కుమారుడు రాజు ఉన్నారు. రాజు ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లగా తండ్రి మరణవార్త తెలుసుకుని బుధవారం స్వగ్రామం చేరుకుని, అంత్యక్రియలు పూర్తిచేశాడు.
కరెంట్ షాక్‌తో అసిస్టెంట్ లైన్‌మన్ ..
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణ శివారు రంగంపల్లిలో అసిస్టెంట్ లైన్‌మన్ వేల్పుల మహేశ్(36) కరెంట్ షాక్‌తో బుధవారం మృత్యువాత పడ్డాడు. రామగుండం మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన మహేశ్.. కొంతకాలంగా రంగంపల్లిలో నివాసముంటూ రంగంపల్లిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. విద్యుత్ మరమ్మతు పనుల్లో భాగంగా స్తంభం పైకి ఎక్కి ప్రమాదవశాత్తు షాక్‌కు గురై మరణించాడు. ఘటనాస్థలాన్ని డీఈఈ రాజబ్రహ్మచారి, టౌన్ ఏఈ శ్రీనివాస్‌తోపాటు పలువురు అధికారులు సందర్శించి ప్రమాదఘటనకు కారణాలపై ఆరా తీశారు. మహేశ్‌కు భార్య సంధ్య, ఇద్దరు సంతానం ఉన్నారు. మహేశ్ మృతికి అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.
చెట్లు నరికినందుకు రూ.1.05లక్షల జరిమానా
కొడిమ్యాల: మండలంలోని చెప్యాలలో పంచాయతీ అనుమతి లేకుండా రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను నరికివేసినందుకు ఓ వ్యక్తికి రూ.1.05 లక్షల జరిమానా విధిస్తూ గ్రామ పంచాయతీ నోటీసు జారీ చేసింది. గ్రామంలో సోలార్ ప్లాంట్ నిర్మాణం కోసం విద్యుత్ స్తంభాలు వేసి.. వాటికి వైర్లులాగేందుకు అదే గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి రోడ్డుకిరువైపులా ఉన్న చెట్లను నరికి వేయించాడు. మొత్తం 35 చెట్లను నరికినందుకు చెట్టుకు రూ.3,000 చొప్పున రూ.1,05,000 జరిమానా చెల్లించాలని ఆదేశిస్తూ పంచాయతీ కార్యదర్శి నోటీసులు అందించారు.
హుజూరాబాద్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు
హుజూరాబాద్: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం హుజూరాబాద్ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ఈ నెల 22న అరుణాచలానికి ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్ర నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ టి. దయాకర్ ప్రకటనలో తెలిపారు. యాత్రలో భాగంగా కాణిపాకం వినాయకస్వామి, వెల్లూరు గోల్డెన్ టెంపుల్, తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయాలతో పాటు అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయాలను దర్శించుకునేలా ప్రణాళిక రూపొందించారు. 22న సాయంత్రం ఆరు గంటలకు హుజూరాబాద్ డిపో నుంచి బస్సు బయలుదేరుతుందని పేర్కొన్నారు. ఈ యాత్రకు టికెట్ ధర పెద్దలకు రూ. 4,500, పిల్లలకు రూ.3,200గా నిర్ణయించామని, ఆసక్తి గల భక్తులు ముందుగా సీట్లు రిజర్వేషన్ చేసుకోవాలని కోరారు.


