కలెక్టర్ నుంచి అవార్డు అందుకుంటున్న విద్యార్థినులు
మాన్షా మహావీన్, మెహక్ ఫాతిమా
సీఎం చేతుల మీదుగా పురస్కారం అందుకుంటున్న సువర్ణ
సప్తగిరికాలనీ(కరీంనగర్): రేకుర్తిలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, సీవోఈ బాలికల–1 విద్యాసంస్థ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి పురస్కరించుకొని జాతీయ విద్యాదినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో పురస్కారాలు అందుకున్నారు. ఒకవైపు పాఠశాల సోషల్ స్టడీస్ పీజీటీ ఉపాధ్యాయురాలు జి.సువర్ణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు అందుకోగా.. మరోవైపు విద్యార్థినులు మాన్షా మహావీన్, మెహక్ ఫాతిమా ఉత్తమ విద్యార్థి అవార్డులతో మెరిశారు. కలెక్టర్ చిత్రా మిశ్రా చేతుల మీదుగా వారు పురస్కారాలు అందుకున్నారు. ఉపాధ్యాయురాలికి ముఖ్యమంత్రి స్థాయిలో గౌరవం.. విద్యార్థినులకు కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారాలు.. ఒకే విద్యాసంస్థ నుంచి వెలువడిన ఈ విజయాలు విద్యాప్రమాణాలకు అద్దం పడుతున్నాయి. జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మహమ్మద్ జలాల్ ఉద్దీన్ అక్బర్, కార్యదర్శి షఫీఉల్లా, డీఐవో సుభాన్, ఆర్‌ఎల్‌సీ రమేశ్‌లాల్, పాఠశాల ప్రిన్సిపాల్ దాసరి స్వాతి, ఉపాధ్యాయులు, సిబ్బంది అవార్డు గ్రహీతలను అభినందించారు. సువర్ణ అందుకున్న ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు ఆమె బోధనా నిబద్ధతకు, విద్యార్థుల పట్ల అంకితభావానికి లభించిన గుర్తింపుగా నిలిచింది. ఇంటర్ విద్యార్థినులు మాన్షా మహావీన్‌తోపాటు 10వ తరగతి విద్యార్థిని మెహక్ ఫాతిమా ఉత్తమ విద్యార్థి అవార్డులకు ఎంపికయ్యారు. కలెక్టర్ చేతుల మీదుగా జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మహమ్మద్ జలాల్ ఉద్దీన్ అక్బర్ సమక్షంలో అవార్డులు అందుకున్నారు.


