● రంగవల్లి 27వ వర్ధంతిలో విమలక్క
వేములవాడ అర్బన్: రంగవల్లి అక్కతో తనది ఉద్యమ అనుబంధం అని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క గుర్తు చేసుకున్నారు. వేములవాడ మున్సిపల్ పరిధి నందికమాన్ వద్ద ఉన్న కామ్రేడ్ రంగవల్లి విజ్ఞాన కేంద్రం(ఆర్‌వీకే) ద్వితీయ వార్షికోత్సవ సభ, రంగవల్లి 27వ వర్ధంతిని బుధవారం నిర్వహించగా.. విమలక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రంగవల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి ఆర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏటా నవంబర్‌లో అమరుల త్యాగాలను స్మరిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రంగవల్లి అక్కతో తనకు ఉద్యమ అనుబంధం ఉందన్నారు. అక్కను గుర్తు చేసుకోవడం అంటే ఆమె చేసిన పోరాటాలతో పాటు, ఈ సమాజంలో నెలకొన్న సమస్యలపై సమష్టి పోరాటం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఆర్‌వీకే సభ్యురాలు రాజేశ్వరి, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, విజయ్, ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక రాష్ట్ర కన్వీనర్ సంతోష్, శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు లక్ష్మీ, మార్వాడీ సుదర్శన్, స్వామిదాస్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
నమ్మించి.. పాలేరుగా చేరి
కోనరావుపేట: గొర్రెల యజమానిని నమ్మించి పాలేరుగా చేరి ఒక్కొక్కటిగా గొర్రెలను అపహరించి విక్రయించిన ఘటనపై బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. కోనరావుపేట మండలం మల్కపేటకు చెందిన ఎక్కల్‌దేవి నాగరాజుకు చెందిన గొర్రెలను మేపేందుకు అదే గ్రామానికి చెందిన శివరాత్రి రాజు 8నెలల క్రితం పనిలో చేరాడు. గొర్లను తీసుకుని శివంగాలపల్లి అటవీప్రాంతానికి వెళ్లేవాడు. కోనరావుపేటకు చెందిన రాకేశ్, శేఖర్, మల్లారానికి చెందిన శంకర్‌రాజు, శివంగాలపల్లికి చెందిన ఇప్ప మహేశ్‌తో కలిసి ప్రతినెలా 3– 4 గొర్రెలను అనుమానం రాకుండా దొంగతనంగా విక్రయించారు. ఇటీవల 44 గొర్లను ఒక్కసారిగా విక్రయించారు. విషయం తెలిసిన నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై రామ్మోహన్ కేసు నమోదు చేశారు. శివంగాలపల్లిలో 11 గొర్రెలను స్వాధీనం చేసుకుని రాజు, మహేశ్‌ను అరెస్ట్ చేశామని తెలిపారు.


