పల్లె ఆదాయం.. పల్లెకే..! | - | Sakshi
Sakshi News home page

పల్లె ఆదాయం.. పల్లెకే..!

Nov 10 2026 2:01 AM | Updated on Nov 10 2026 2:01 AM

ట్రెజరీ చిక్కులకు తెర

పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ

ప్రభుత్వ ఉత్తర్వులతో సర్పంచుల్లో హర్షం

జిల్లాలోని 318 గ్రామ పంచాయతీలకు ప్రయోజనం

కరీంనగర్‌టౌన్‌: గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వయంప్రతిపత్తి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీలు తమ సొంత వనరుల ద్వారా సమకూర్చుకునే ఆదాయాన్ని ఇకపై ట్రెజరీలో జమ చేయకుండా నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకొని నిబంధనల ప్రకారం వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం–2018లోని సెక్షన్‌ 70(3)కు సవరణ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 43తో కొత్త విధానం అమల్లోకి వచ్చింది. దీంతో కరీంనగర్‌ జిల్లా పరిధిలోని 318 గ్రామ పంచాయతీలకు ప్రయోజనం చేకూరనుంది.

ఇంతకుముందు ట్రెజరీ ద్వారా..

ఇప్పటివరకు గ్రామాల్లో ఇంటి, ఇతర స్థానిక పన్నులు, ఫీజుల రూపంలో సమకూరే ఆదాయాన్ని ట్రెజరీ ద్వారా నిర్వహించాల్సి వచ్చేది. దీంతో గ్రామాల్లో అత్యవసర పనులకు సైతం నిధులు వినియోగించుకోవడంలో జాప్యం జరిగేది. పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, అంతర్గత రహదారుల మరమ్మతు, డ్రైనేజీల నిర్వహణ వంటి పనులకు నిధులు అవసరమైనప్పుడు ఇబ్బందులు ఎదురయ్యేవి. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో స్థానికంగా సమకూరే ఆదాయం నేరుగా పంచాయతీ ఖాతాలోకి చేరనుండటంతో.. గ్రామ అవసరాలకనుగుణంగా పనులు చేపట్టేందుకు వెసులుబాటు కలగనుంది.

అభివృద్ధికి దోహదం

ప్రభుత్వ నిర్ణయంపై కరీంనగర్‌ జిల్లాలోని సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి వచ్చే ఆదాయం గ్రామాభివృద్ధికే వినియోగించుకునే అవకాశం రావడం సంతోషకరమని పేర్కొంటున్నారు. చిన్నచిన్న పనుల కోసం కూడా నిధుల విడుదల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రామసభ తీర్మానాలు, ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా నిధులను వినియోగించుకుంటూ గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. పల్లె ఆదాయం పల్లె అవసరాలకే అందుబాటులోకి రావడంతో స్థానిక పాలనకు మరింత బలం చేకూరనుందని డీపీవో జగదీశ్వర్‌ వెల్లడించారు. ఎప్పటిలాగే సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ జాయింట్‌ చెక్‌ పవర్‌తో గ్రామాభివృద్ధికి పంచాయతీ నుంచి వసూలయ్యే పన్నులను ఉపయోగించుకునేందుకు మార్గం సుగమమవుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement