కరీంనగర్‌సిటీ: శాతవాహన యూనివర్సిటీ క్యాంపస్‌లో అభివృద్ధి పనుల పేరుతో జరుగుతున్న భారీ తవ్వకాలు, మట్టి తరలింపు, ఎన్నో ఏళ్ల నాటి చెట్ల నరికివేతపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్, అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీలో నూతనంగా నిర్మిస్తున్న స్టేడియం గ్యాలరీ, లా కళాశాల, సింథటిక్ ట్రాక్ వంటి అభివృద్ధి పనుల పేరుతో సుమారు రెండెకరాల విస్తీర్ణంలో 10 అడుగుల కంటే ఎక్కువ లోతుగా భారీగా తవ్వకాలు చేపట్టి చెట్లను నరికేస్తున్నారన్నారు. గతంలో నెమళ్లతోపాటు అనేక రకాల పక్షులు, వన్యప్రాణులు కనిపించేవని, ప్రస్తుతం గణనీయంగా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్సిటీ జేఏసీ చైర్మన్ కారికే మహేశ్, అధ్యక్షుడు కేశవ్, ఏఐఎస్ఎఫ్ కన్వీనర్ శివాజీ, లక్ష్మణ్ సాయి, ఉపాధ్యక్షుడు శ్రీధర్, ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు ఓంప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
విచారణకు ఆదేశం
ఫిర్యాదును స్వీకరించిన కలెక్టర్ వెంటనే విచారణకు ఆదేశించారు. కొత్తపల్లి రెవెన్యూ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. నివేదిక ఉన్నతాధికారులకు అందజేయనున్నామని తెలిపారు.
అక్రమాలకు అవకాశమే లేదు
ఈ విషయమై వీసీ ఉమేశ్‌కుమార్ వివరణ కోరగా.. యూనివర్సిటీలో జరుగుతున్న నిర్మాణాలు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.


