కరీంనగర్/కొత్తపల్లి: ప్రభుత్వ ఆస్పత్రిలో నాణ్యమైన వైద్యసేవలతో పాటు రోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కలెక్టర్ చిత్రామిశ్రా స్పష్టం చేశారు. శనివారం కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)ని సందర్శించారు. ఎంఎన్‌డబ్ల్యూ యూనిట్, మహిళా వార్డు, ఓపీ, సర్జికల్ తదితర విభాగాలను సందర్శించి, రోగులతో మాట్లాడారు. ఆస్పత్రిలో ప్యాచ్‌వర్క్‌లు, మరుగుదొడ్ల మరమ్మతులు, గదులు, కిటికీల మరమ్మతు పనులు పరిశీలించారు. గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు మెరుగైన చికిత్స అందించేందుకు సుమారు రూ.6.5 కోట్లతో ఏర్పాటు చేసిన క్యాత్ ల్యాబ్ మిషన్లు, క్రిటికల్ కేర్ సెంటర్‌ను పరిశీలించారు. పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చేందుకు వైద్యాధికారులతో చర్చించారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఆవరణలో రూ.35 లక్షలతో ఏర్పాటు చేయనున్న విశ్రాంతి గదుల షెడ్డు పనులను పరిశీలించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్‌ఎంవో ఉన్నారు.
గోల్డెన్ అవర్‌లో చికిత్సతోనే ప్రాణరక్షణ
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు గోల్డెన్ అవర్‌లో అత్యవసర వైద్య చికిత్స అందించి ప్రాణాలను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం రాహత్ పథకం కింద అర్హులైన బాధితులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరీంనగర్ నుంచి కలెక్టర్ చిత్రామిశ్రా పాల్గొన్నారు.
వైద్య కళాశాల పనులు వేగవంతం చేయాలి
ప్రభుత్వ వైద్య కళాశాల, వసతి గృహాల భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. కొత్తపల్లిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల, మెడికోల వసతి గృహాలు, నర్సింగ్ కళాశాల భవనాలను పరిశీలించారు. విద్యార్థుల హాస్టల్ భవనాలను నెలలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ వైద్య కళాశాల భవనానికి సంబంధించి మిగిలి ఉన్న పనులపై నివేదిక సమర్పించాలని ఆర్‌అండ్‌బీ డీఈ శ్రీకాంత్‌ను ఆదేశించారు. టీజీఎంఎస్‌ఐడీసీ ఆధ్వర్యంలో రూ.26 కోట్లతో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల, హాస్టల్ భవనాన్ని పరిశీలించారు. పనులు నవంబర్‌లోగా పూర్తి చేయనున్నట్లు అధికారులు వివరించారు.


