రైళ్లలో తిరుగు ప్రయాణికుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

రైళ్లలో తిరుగు ప్రయాణికుల రద్దీ

Oct 22 2026 11:57 PM | Updated on Oct 22 2026 11:57 PM

రామగుండం: దసరా పండుగకు స్వగ్రామాలకు చేరుకున్న ప్రజలు తిరుగు ప్రయాణాల నేపధ్యంలో హైదరాబాద్‌ వైపు వెళ్లు భాగ్యనగర్‌, ఫెస్టివల్‌ స్పెషల్‌, ఇంటర్‌సిటీ, కాగజ్‌నగర్‌, దాణాపూర్‌ తదితర ఎక్స్‌ప్రెస్‌ రైళ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడాయి. రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలంటే ఆర్టీసీ బస్సుల్లో చార్జీల వాయింపు, ప్రయాణ సమయం అధికం, కిక్కిరిసిపోతున్న బస్సులతో ఇబ్బందులు పడలేక తక్కువ చార్జీలతో ప్రయాణ సమయం తక్కువగా ఉండే రైలు ప్రయాణాలపైనే మొగ్గు చూపిస్తుండడంతో రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి.

ట్రాక్టర్‌ను తప్పించబోయి ఆటో బోల్తా

హుజూరాబాద్‌ రూరల్‌: మండలంలోని సిర్సపల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయే క్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంకట్రావుపల్లికి చెందిన చొప్పదండి అరుణ (43), దేవేందర్‌ (27)గా గుర్తించారు. స్థానికులు గాయపడిన వారిని హుజూరాబాద్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

సర్పంచ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు

రామడుగు: మండలంలోని గోలిరామయ్యపల్లి సర్పంచ్‌ నునుగొండ అంజలినరేశ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనట్లు ఎస్సై కె. రాజు తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన నలువాల సరోజ భూ సమస్య విషయమై పంచాయతీకి వెళ్లగా సర్పంచ్‌ కులం పేరుతో దూషించగా బాధితురాలి ఫిర్యాదుతో సర్పంచ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుఎస్సై పేర్కొన్నారు.

ఉరేసుకుని మహిళ బలవన్మరణం

గొల్లపల్లి: ఉరేసుకుని మహిళ బలవన్మరణానికి పాల్పడిన ఘటన గొల్లపల్లి మండలం వెనుగుమట్ల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సబ్బనేవేని మానస అలియాస్‌ కేతనవేని గాయత్రి (28)కి అదే గ్రామానికి చెందిన తిరుపతితో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. అప్పటినుంచి భార్యాభర్తలు హైదరాబాద్‌లో ఉంటున్నారు. దసరా పండుగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చారు. గాయత్రికి మూడేళ్ల నుంచి ఆరోగ్యం సరిగా ఉండడం లేదు. హైదరాబాద్‌, ముంబయి ఆస్పత్రిలో చూపిస్తున్నారు. తిరుపతి బుధవారం ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లాడు. గాయత్రి అత్తామామలు గతంలో మూడు నెలల వ్యవధిలోనే ఇద్దరూ చనిపోయారు. గాయత్రి తన కూతురుతో కలిసి అత్తాగారింట్లో ఉంది. అనారోగ్యంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. మృతురాలి తండ్రి సబ్బనేవేని లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.కృష్ణసాగర్‌ రెడ్డి తెలిపారు.

మనోవేదనకు గురై వ్యక్తి మృతి

పెద్దపల్లి: కుటుంబ కలహాలతో మనోవేదనకు గురై పెద్దపల్లి పట్టణంలోని సుభాష్‌నగర్‌లో వినుకొండ గణేశ్‌ (40) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గణేశ్‌కు ఏడేళ్ల క్రితం కాజీపేటకు చెందిన మాధవితో వివాహమైంది. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా గణేశ్‌ పనులకు వెళ్లకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఏడాది క్రితం మాధవి కుమారుడిని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి భార్య, కుమారుడు దూరంగా ఉండటంతో గణేశ్‌ మనోవేదనకు గురవుతున్నాడు. మంగళవారం రాత్రి భోజనం చేసిన గణేశ్‌ తన గదిలోకి వెళ్లాడు. బుధవారం ఉదయం 10.30 గంటలైనా బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. తలుపులు తెరిచి చూడగా గణేశ్‌ మృతిచెంది కనిపించాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పెద్దపల్లి టౌన్‌ ఎస్సై రాజశేఖర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన కుమారుడి మృతిపై ఎవరి మీదా అనుమానం లేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement