జగిత్యాల క్రైం: జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్ వద్ద గురువారం రాత్రి రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు అతివేగంగా వచ్చి ఢీ కొని మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సంజయ్‌కుమార్ గోస్వామి(45) పట్టణంలో కూలి పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు. జగిత్యాల, నిజామాబాద్ రహదారిపై.. గాంధీనగర్ వద్ద రోడ్డు దాటుతుండగా కారు అతివేగంతో వచ్చి ఢీకొంది. సంజయ్‌కు తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు, ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు సునేర్, కౌన్సిలర్ రజీ జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన కారుడ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
కాట్నపల్లిలో ఒకరు..
సుల్తానాబాద్‌రూరల్: సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ శివారులోని రాజీవ్ రహదారిపై గురువారం తెల్లవారుజామున కారు ఢీకొని ఉత్తరప్రదేశ్‌కు చెందిన కూలీ ముక్తేశ్వర్ సాహ్(57) మృతి చెందాడు. ఎస్సై చంద్రకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ముక్తేశ్వర్ సాహ్‌తో పాటు మరికొందరు కలిసి శాంతి ఇన్‌ఫ్రా కంపెనీకి చెందిన గ్యాస్ పైప్‌లైన్ వేసేందుకు వచ్చి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉంటున్నారు. గురువారం రాత్రి కాట్నపల్లి వద్ద పైప్‌లైన్ పనులు చేస్తుండగా ముక్తేశ్వర్ సాహ్ ట్రాఫిక్ లైట్‌తో సిగ్నిల్ ఇస్తుండగా పెద్దపల్లి నుంచి కరీంనగర్ వైపునకు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి కూలీలు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి అన్న కొడుకు మనోజ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై తెలిపారు.


