బడా నేతకు భంగపాటు
ఉక్కుపాదం మోపాల్సిందే
‘సాక్షి’ కథనంతో వెలుగులోకొచ్చిన కోతిరాంపూర్ భూ కబ్జా
అజ్ఞాతంలోకి నిందితులు
వివాదాస్పద స్థలంలో మరిన్ని అవకతవకలు గుర్తించిన పోలీసులు
కలెక్టర్ దృష్టికి వ్యవహారం
లేని ప్లాట్లు ఉన్నట్లుగా చూపి విక్రయాలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
కరీం‘నగరం’లోని కోతిరాంపూర్ భూకబ్జాలో తీగలాగితే డొంక కదులుతోంది. ‘నిద్రలేచిన భూ బకాసులు’ శీర్షికన ‘సాక్షి’ కోతిరాంపూర్ భూకబ్జా ను గురువారం వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఈనెల 15నే వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినా.. ఓ జాతీయ పార్టీకి చెందిన నేత జోక్యంతో నిందితులు అరెస్ట్ కాలేదు. ఈ అంశాన్ని కూడా ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో 13 మందిలో కీలక సూత్రదారులుగా భావిస్తున్న మాజీ కార్పొరేటర్‌తోసహా ఆరుగురు అదృశ్యమయ్యారు. గురువారం ఉదయం వారిని కమిషనరేట్ కార్యాలయానికి పిలిపించేందుకు ఈవోడబ్ల్యూ విభాగం పోలీసులు సంప్రదించగా ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చాయి. మరింత ఆరా తీయగా.. వారు నగరంలో లేరని నిర్ధారించుకున్నారు.
తవ్వినకొద్దీ అక్రమాలే..
కోతిరాంపూర్‌లోని వివాదాస్పద స్థలం వ్యవహారం ఈనాటిది కాదు. ఆ స్థలం మొత్తం మూడున్నర ఎకరాలు కాగా.. ప్లాట్లు చేసిన సమయంలో 30శాతం రోడ్లు, ఇతర సదుపాయాలకు కేటాయించాలి. ఈ లెక్కన దాదాపు 2.10 ఎకరాలే ప్లాట్లు చేయాలి. కానీ సదరు లేఅవుట్‌లో విక్రయించిన ప్లాట్ల మొ త్తం విస్తీర్ణం కలిపితే దాదాపు 3.20 ఎకరాలకు పైగా వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్లాట్లు చేసిన ప్రాంతంలో అవకతవకలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. మొదటి నుంచి ఈ లేఅవుట్‌ను వివాదా లు వెంటాడుతునే ఉన్నాయి. 2010, 2016లో ఈ లేఅవుట్‌పై రెండు కోర్టు కేసులు నడవగా.. 2023లో రెండు కేసుల్లోనూ ప్రస్తుత నిందితులకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చినట్లు పోలీసులు సమాచారం సేకరించారు.
2019లో నాలుగు సేల్‌డీడ్స్..
లే అవుట్లపై వివాదాలు నడుస్తున్న క్రమంలోనే వివాదాస్పద స్థలం నుంచి 4 ప్లాట్లు సేల్ డీడ్స్ ద్వారా రిజిస్ట్రేషన్ జరిగాయి. ఆ నాలిగింటిలో ఒక ప్లాటు విషయంలో వన్‌టౌన్ పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేశారు. మిగిలిన మూడు పాట్లు లేఅవుట్లలో లేనట్లు గుర్తించారు. ఈ మూడు సేల్ డీడ్లకు యజమానులు భూమి ఉందని అనుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో లేకపోవడం గమనార్హం. లేని ప్లాట్లను చూపించిన నిందితులు వాటిని విక్రయించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చి, అర్బన్ తహసీల్దార్‌ను లిఖితపూర్వక నివేదిక కోరారు. ఈ కేసులో ఇప్పటికే తహసీల్దార్ సంతకం, స్టాంపులు, డాక్యుమెంట్లు పోర్జరీవేనని తేల్చినప్పటికీ నివేదిక ఇచ్చేందుకు తటపటాయిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే ఈ భూమి క్రయవిక్రయాలపై పూర్తి సమాచారం వస్తుందని దీమాగా ఉన్నారు.
ఈ విషయంలో నిందితులను అరెస్ట్ చేయవద్దంటూ పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చిన జాతీయపార్టీకి చెందిన నాయకుడికి భంగపాటు ఎదురైంది. గురువారం ఉదయం కీలక సూత్రదారులు పరార్ కావడంతో సదరు నేత విచారం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విచారణకు సహకరిస్తారనే ఉద్దేశంతోనే తాను దసరా వరకు ఆగమన్నానని, పరార్ అవుతారమే విషయం ఊహించలేకపోయానని సన్నిహితులతో వాపోతున్నట్లు తెలిసింది. తన ఫోన్‌కాల్ ఆధారంగా కేసులో నిందితులు నగరం నుంచి తప్పించుకుని పోవడంతో సదరు జాతీయ పార్టీ నేత నిర్వేదంలో కూరుకుపోయినట్లు సమాచారం. నిందితులంతా తమ రాజకీయ విరోది అయిన మరో జాతీయ పార్టీకి చెందిన నేతలు కావడం కొసమెరుపు.
సామాన్యుల భూములపై కన్నేసినవారిపై పోలీసులు ఉక్కుపాదం మోపాలి. నిందితులు ఎంతటివారైనా సమగ్ర విచారణ చేపట్టాలి. దోషులుగా తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. భూకబ్జాదారుల నుంచి బాధితులకు న్యాయం జరిగేలా చూడటం పోలీసుల బాధ్యత.
– బండి సంజయ్, కేంద్ర సహాయమంత్రి


