కరీంనగర్‌క్రైం: నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను కరీంనగర్ టూ టౌన్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి నుంచి 19 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నుస్తులాపూర్‌కు చెందిన పింగళి విజేందర్‌రెడ్డి(33), కాదరి స్వామి (27) నగరంలోని పద్మనగర్‌లో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా విజేందర్‌రెడ్డి కరీంనగర్, ఎల్ఎండీ, వేములవాడ ప్రాంతాల్లో సుమారు 39 బైక్‌లు చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. ఆ వాహనాలను కాదరి స్వామికి విక్రయించాడు. స్వామి కొన్నింటిని స్క్రాప్‌గా విక్రయించాడు. మరికొన్నింటిని ఇతర స్క్రాప్ వ్యాపారులకు విక్రయించాడు. విజేందర్‌రెడ్డి నుంచి 11 ద్విచక్ర వాహనాలు, స్వామి నుంచి 5, స్క్రాప్ వ్యాపారులైన షేక్ ముబీన్ హుస్సేన్, సయ్యద్ అబ్దుల్ హమీద్ నుంచి 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు కరీంనగర్ వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్, ఎల్ఎండీ, వేములవాడటౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన పలు ద్విచక్ర వాహనాల చోరీ కేసులతో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 39వాహనాల చోరీపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని సీఐ సృజన్‌రెడ్డి వివరించారు. ఎస్సైలు ఎ.శ్రీనాథ్, పి.శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ బషీరుద్దీన్, కానిస్టేబుళ్లు మల్లయ్య, హరీశ్‌రెడ్డి పాల్గొన్నారు.


