కరీంనగర్ బస్టాండ్‌లో..
కరీంనగర్ బస్టాండ్‌లో ప్రయాణికుల నిలువు దోపిడీ
దుకాణాదారుల కాసుల కక్కుర్తి.. ఇష్టారాజ్యంగా విక్రయాలు
ప్రశ్నిస్తే దురుసుగా సమాధానం
పట్టించుకోని సంబంధిత అధికారులు
కరీంనగర్‌టౌన్: ప్రజాసౌలభ్యం కోసం ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తెచ్చినా, ఎంత కఠినంగా వ్యవహరించినా, ఎన్నిసార్లు ఆదేశాలిచ్చినా తీరు మార్చుకోవడం లేదు కరీంనగర్ బస్టాండు ప్రాంగణంలోని దుకాణాల నిర్వాహకులు. పరిస్థితి మార్చడానికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎంత ప్రయత్నించినా వ్యాపారుల కాసుల కక్కుర్తి తగ్గడం లేదు. ప్రయాణికులకు వాటర్ బాటిల్‌ను ఎంఆర్‌పీకే విక్రయించాలని చెప్పి, దాడులు నిర్వహిస్తున్నా వారి దారి వారిదే, దొరికినంత దండుకోవడమే.. బస్టాండులో ఇప్పటికే పలుమార్లు ట్రాన్స్‌పోర్టు పోలీసులు, ఆర్టీసీ యాజమాన్యం దాడులు నిర్వహించి, రూ.1,000 నుంచి రూ.5,000 వరకు జరిమానా విధించి, మెమోలు జారీ చేసినా వారి తీరు మారడం లేదు.
తనిఖీలు లేక ఇష్టారాజ్యం
కరీంనగర్ బస్టాండ్ ప్రాంగణంలోని దుకాణ నిర్వాహకులు లీటరు వాటర్‌బాటిల్ ధర రూ.20 ఉంటే రూ.25 నుంచి రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని షాపుల ఎదుట ఎమ్మార్పీ ధరలతో బోర్డు ఉంచినా అంతకుమించి వసూలు చేస్తున్నారు. కంపా శూర్ అనే వాటర్ బాటిల్‌పై ఎమ్మార్పీ ముద్రించకుండానే యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. హడావుడిలో ప్రయాణికులు కొంటున్నారు. కొంతమంది ఇ దేంటని ప్రశ్నిస్తే ఎక్కడైనా బస్టాండుల్లో ఎమ్మార్పీ ధరకు ఇస్తారా? అంటూ నిర్లక్ష్యంగా బదులిస్తున్నా రు. వాటర్ బాటిళ్లతో పాటు చిన్నపాటి కూల్‌డ్రింక్స్, బిస్కెట్స్, సమోసా, చిప్స్ ఇతరాత్ర తినుబండారాల నాణ్యతపై తనిఖీలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా విక్రయాలు సాగిస్తున్నారు. బస్సుల కోసం హడావుడిలో దుకాణదారులు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సి వస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణప్రాంగణంలోనే సంస్థ కార్యాలయం, విజిలెన్స్ అధికారులుంటారు, వారికి తెలిసే ఇదంతా జరుగుతోందని ప్రయాణికులు అంటున్నారు. తాగునీటి బాటిల్ దుకాణాదారులకు ఎ మ్మార్పీ కంటే తక్కువకే వస్తుంది. బిస్లరీ బాటిల్‌పై రూ.20 ఉండగా రూ.30 వరకు దండుకుంటున్నా రు. దీనిపై ప్రశ్నిస్తే.. కూలింగ్ లేని బాటిల్ అయితే ఎమ్మార్పీ ధరకు విక్రయిస్తామని దుకాణాదారులు చెప్పడం గమనార్హం. ఇతర తినుబండరాలను ఎమ్మార్పీకంటే ఎక్కువ ధరకే విక్రయిస్తున్నారు. నిర్వాహకులపై ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
తాగునీటికీ దోపిడేనా?
అసలే ఎండాకాలంలా ఎండలు దంచి కొడుతున్నాయి. బస్టాండులో తాగుదామన్నా చల్లని నీరు దొరికే పరిస్థితి లేదు. దుకాణాల్లో కొనుక్కుందామంటే అధిక ధరలతో దోచుకుంటున్నరు. లీటరు వాటర్ బాటిల్‌కు రూ.20 ఉంటే, రూ.5 నుంచి రూ.10 అధికంగా తీసుకుంటున్నరు. సంబంధిత అధికారులు ఏం చేస్తున్నరు, దుకాణాదారులపై చర్యలు తీసుకోవాలి.
– రామకృష్ణ, ప్రయాణికుడు, హైదరాబాద్
మొత్తం ప్లాట్‌ఫాంలు 45
రోజువారీగా నడిచే బస్సులు 1,740
రోజూ రాకపోకలు సాగించే ప్రయాణికులు 1.50 లక్షల నుంచి 2 లక్షల వరకు


