మార్కెట్‌లో ఓ రేటు, మిల్లుల్లో మరో రేటు
జమ్మికుంట జిన్నింగ్
మిల్లుల్లో దోపిడీ
‘ఈ రైతు పేరు కుడుతల మల్లయ్య, జమ్మికుంట మండలం విలాసాగార్ గ్రామం. సోమవారం జమ్మికుంట మార్కెట్‌కు వ్యాన్‌లో పత్తి అమ్మకానికి తీసుకవచ్చాడు. మార్కెట్‌లో వేలంలో మొదట క్వింటాల్‌కు రూ.8,850 పలికింది. సింధు కాటన్ మిల్లులో దిగుమతి చేసేందుకు వ్యాన్ తీసుకవచ్చాడు. మిల్లులో తేమ పేరుతో రూ.8,750 రేటు వేశారు. అంతేకాకుండా రైతుకు తెలువకుండానే కాంటా వేసి, 11క్వింటాళ్ల పైచిలుకు వచ్చిందని తెలిపారు. ఈ విషయంపై రైతు ఆందోళన వ్యక్తం చేయడంతో క్వింటాల్‌కు రూ.8,800 వేసినట్లు రశీదు ఇచ్చారు. పాపక్కపల్లికి చెందిన వేల్పుల మధునయ్య రెండు క్వింటాళ్ల పత్తి తీసకు రాగా క్వింటాల్‌కు రూ.8,870 పలికింది. నర్సింహ కాటన్ మిల్లులో దిగుమతి చేసుకోగా కింటాల్‌కు రూ.100 తీసేసి ‘ఇష్టం ఉంటే ఇవ్వు లేదంటే పత్తి తీసుకుపో’ అంటూ యజమాని దురుసుగా ప్రవర్తించాడని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా వీరిద్దరి రైతుల పరిస్థితి మాత్రమే కాదు.. మార్కెట్‌కు వచ్చిన అన్నదాతలందరి దుస్థితి. మార్కెట్‌లో వేలం ధరలు ఇవ్వకుండా మిల్లుల్లో ఖరీదు వ్యాపారుల తీరుతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జమ్మికుంట: జమ్మకుంట పత్తి మార్కెట్‌లో వేలంలో నిర్ణయించిన ధరలు అమలు కావడంలేదు. మిల్లర్లు రేటు తగ్గిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో నిర్ణయించిన వేలం ధరలు అమలు చేసేలా ప్రభుత్వం, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో అమ్మకాలు
పత్తి ఉత్పత్తుల రాక ఇప్పుడిప్పుడే మొదలైంది. పత్తి తీసేందుకు కూలీలు, రవాణా, పండుగల ఖర్చు నేపథ్యంలో మంచి ధరలు పలుకుతున్నాయనే అశతో రైతులు అమ్మకాలు సాగిస్తున్నారు. కాగా, తేమ శాతం, నాణ్యత లేదంటూ వ్యాపారులు క్వింటాల్‌కు రూ.100– రూ.200 దండుకుంటున్నారు. కాగా మార్కెట్‌లో సోమవారం క్వింటాల్ పత్తి గరిష్ట ధర రూ.9,100, మోడల్ ధర రూ.8,800, కనిష్ట ధర రూ.8,600 పలికింది.
మార్కెట్‌లో పలికిన రేట్లను తగ్గిస్తున్నారని రైతుల ఫిర్యాదు మేరకు నర్సింహ కాటన్‌మిల్లును పరిశీలించేందుకు వెళ్లగా, మిల్లరు దురుసుగా ప్రవర్తించాడు. అక్కడున్నవారితో భౌతిక దాడులు చేసేందుకు పూనుకున్నారు. సదరు మిల్లర్‌పై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినం.
– పూల్లురి స్వప్నసదానందం,
మార్కెట్ చైర్‌పర్సన్, జమ్మికుంట


