న్యూస్‌రీల్
దండిగా రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల మద్దతు
రెండెకరాల లే అవుట్‌లో 4 ఎకరాల ప్లాట్లు విక్రయం
నకిలీ పత్రాలతో యజమానులకు బెదిరింపులు
కోర్టు మొట్టికాయలు వేసినా.. ఆగని దూకుడు
కోతిరాంపూర్ భూ దందాలో విస్తుగొలిపే వాస్తవాలు
మంగళవారం శ్రీ 27 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
ఖాకీ, ఖద్దరు అండ
సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●:
కరీంనగర్‌లోని కోతిరాంపూర్ భూదందాలో రోజుకో కొత్తకోణం వెలుగుచూస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని కేవలం రెండు కుటుంబాలు కలిసి నడిపిస్తున్నాయని పోలీసుల తాజా దర్యాప్తులో వెల్లడైంది. గతంలోనే తాము విక్రయించిన ప్లాట్లకే నకిలీ పత్రాలు సృష్టించి డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తున్న వైనాన్ని ఎట్టకేలకు పోలీసులు బట్టబయలు చేశారు. కోతిరాంపూర్‌లో భూదందాలో కీలకంగా ఉన్న రెండు కుటుంబాలకు పోలీసులు, పలు పార్టీల నేతలు, రిజిస్ట్రేషన్ అధికారులు అండగా నిలుస్తుండటం సామాన్యులను కలవరపాటుకు గురిచేస్తోంది. బాధితులకు మేమున్నామంటూ ఏ రాజకీయ పార్టీ నేతలు ముందుకు రాకపోగా.. కబ్జా చేస్తున్న వారిని అరెస్టు చేయవద్దంటూ అన్ని పార్టీల నేతలు పోలీసులపై ఒత్తిడి తీసుకురావడం కరీంనగర్‌లో రాజకీయ పరిసి్?థ్తకి అద్దం పడుతోంది.
కోతిరాంపూర్‌లోని వివాదాస్పద మూడున్నరెకాల స్థలంలో 1992లో వెంచర్ వేశారు. ఇందులో 30శాతం రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు పోగా.. దాదాపు రెండున్నరెకరాలు ప్లాటింగ్ చేయాలి. అయితే, తాజాగా ఈ భూదందాపై దర్యాప్తు చేస్తున్న ఎకనమిక్స్ అఫెన్స్ వింగ్ (ఈవోడబ్ల్యూ) అధికారులు మాత్రం మొత్తం 4.08 ఎకరాల విస్తీర్ణానికి రిజిస్ట్రేషన్ జరిగిందని తెలుసుకుని అవాక్కయ్యారు. మరింత లోతుగా ఆరా తీయగా.. 1992లోనే అమ్మిన చాలా ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఇదే అదనుగా వెంచర్ వేసిన కుటుంబం, మాజీ కార్పొరేటర్ దంపతుల కుటుంబాలు చేతులు కలిపాయి. తమ వద్ద ఉన్న పాత పేపర్లతో డబుల్ రిజిస్ట్రేషన్ దందా ప్రారంభించాయి. వాటి సాయంతో భూ యజమానులను బెదిరిస్తారు. బాధితులకు పోరాడే శక్తి లేకపోతే ప్లాట్ ఖాళీ చేసి వెళ్లిపోతారు. బెదిరింపులకు లొంగని వారిని కోర్టు కేసులతో వేధిస్తారు. మొత్తానికి నయానో భయానో తమ దారికి తెచ్చుకుంటారు. ఇలా కోర్టుకు వెళ్లిన కేసుల్లో నిందితులకు రెండుసార్లు కోర్టు మొట్టికాయలు వేసినా వారి తీరు మారడం లేదు.
రెండు నిందిత కుటుంబాలకు రాజకీయంగా పోలీసుపరంగా అండదండలు పుష్కలంగా ఉన్నాయి. వన్‌టౌన్‌లో వీరికి ఓ ఎస్సై అన్ని విధాలా సహకరిస్తున్నాడన్న విమర్శలు ఉన్నాయి. బాధితుల గోడు వినకపోగా.. వారి మీదనే మూడు కేసులు నమోదుచేసి నాలుగోసారి మరో కేసు వేసేందుకు సిద్ధమయ్యాడు. ఈలోపు బాధితులు సీఐకి అసలు విషయం వివరించడంతో తెల్లముఖం వేసిన ఎస్సై ఉన్నపలంగా సెలవుపై వెళ్లిపోయాడు. దర్యాప్తులో భాగంగా రెండువారాల క్రితం 13 మంది నిందితుల్లో కీలక సూత్రధారులైన ఆరుగురిని తెల్లవారుజామునే అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకువచ్చారు. వైద్యపరీక్షలకు పంపేందుకు సిద్ధపడుతుండగా.. వన్‌టౌన్ నుంచి విషయం లీకవడంతో పోలీసులు దసరా వరకు అరెస్టు వాయిదా వేయాల్సి వచ్చింది. ఇదే అదనుగా కీలక నిందితులు నగరం వదిలి అజ్ఞాతంలోకి జారుకున్నారు.


