కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్‌లోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ విద్యార్థుల హాకీ జట్టు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి కాంస్య పతకాన్ని కై వసం చేసుకుంది. హైదరాబాద్ రీజియన్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) తరఫున ప్రాతినిధ్యం వహించిన కరీంనగర్ కేంద్రీయ విద్యాలయ అండర్–14 హాకీ జట్టు ఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబర్చింది. నేషనల్ స్పోర్ట్స్ మీట్‌లో లీగ్ మ్యాచ్‌ల నుంచి సెమీఫైనల్ వరకు అజేయంగా కొనసాగిన జట్టు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో జైపూర్ రీజియన్ జట్టుపై విజయం సాధించి కాంస్య పతకంతో పాటు కప్‌ను కై వసం చేసుకుంది. జట్టు క్రీడాకారులను పాఠశాల ప్రిన్సిపాల్ పంకజ్ కుమార్, పీఈటీ వివేక్ రన్వాల్ తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.
రేపు ఉమ్మడి జిల్లా జూనియర్ ఖోఖో జట్ల ఎంపిక
కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో ఈనెల 4న కరీంనగర్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా (పెద్దపల్లి జిల్లా మినహా) జూనియర్ ఖోఖో జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఖోఖో అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, వై.మహేందర్‌రావు తెలిపారు. జిల్లాలోని ప్రతిభ గల 18ఏళ్ల లోపు బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొనుటకు అర్హులని అన్నారు. ఈ పోటీల్లో ప్రతిభచాటే క్రీడాకారులను ఈనెల 14 నుంచి 17 వరకు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి జూనియర్స్ ఖోఖో పోటీలకు ఎంపిక చేయనున్నామని తెలిపారు. ఎంపికయ్యే ప్రాబబుల్స్‌కు పది రోజులపాటు శిక్షణ శిబిరం ఉంటుందని, ఈ శిబిరంలో తుది జట్టును ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. క్రీడాకారులు ఆధార్ కార్డు జిరాక్స్, ఎస్సెస్సీ మెమో తో హాజరుకావాలని కోరారు.


