గంభీరావుపేట(సిరిసిల్ల): పొలం పనుల్లో ఎప్పుడూ కలిసే అడుగులు.. చివరకు అదే పొలంలో కలిసి ‘పోయాయి’. పచ్చని పొలంలో ఆ దంపతుల జీవి త ప్రయాణం విద్యుత్ షాక్‌తో విషాదాంతమైంది. కుటుంబాన్ని పోషించుకునేందుకు కష్టపడుతూ.. పొలం పనుల్లో ఎప్పుడూ ఒకరినొకరు తోడుగా నిలిచిన భార్యాభర్తలు.. అదే పొలంలో విద్యుత్ షాక్‌తో విగతజీవులుగా మారారు. ఈ విషాదకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలకేంద్రంలో జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాలు.. మండలకేంద్రానికి చెందిన గంట దేవయ్య (65), అతడి భార్య లక్ష్మి (58) స్థానికంగా అర ఎకరం పొలం కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నారు. రోజూ భార్యాభర్తలు వ్యవసాయ పనుల్లో కలిసి నిమగ్నమయ్యేవారు. వరి పంటకు అడవిజంతువుల బెడద తీవ్రమైంది. ఈ క్రమంలో పంట రక్షణకు స్టార్టర్ డబ్బా నుంచి విద్యుత్ వైరు తీసి పొలం చుట్టూ వైరు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రం ఇద్దరూ రోజువారీ మాదిరి గా పొలం వద్దకు వెళ్లారు. అడవి జంతువులు పొలా నికి రాకుండా ఏర్పాటు చేసుకున్న విద్యుత్ వైరే వారి పాలిట మృత్యుపాశమైంది. ప్రమాదవశాత్తు ఆ వైరుకు తగిలి ఆ పచ్చని పంట పొలంలోనే దంపతులిద్దరూ తుదిశ్వాస విడిచారు. ఘటన స్థలాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కంటతడి పెట్టారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. కష్టపడి పెళ్లిళ్లు చేశారు. పిల్లల జీవితాలను కొలిక్కి తెచ్చిన వారు.. శేష జీవితాన్ని వ్యవసాయంపై ఆధారపడి గడుపుతున్న సమయంలో ఒక్కసారిగా ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కన్నీటి వీడ్కోలు
దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లి.. శుక్రవారం గ్రామానికి తీసుకురాగానే విషాద వాతావరణం నెలకొంది. అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నా రు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృత్యువాత పడడంతో పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. ఎప్పుడూ కలిసి కనిపించే దంపతులు ఇక లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. కూతుళ్ల చేతుల మీదుగా దహన సంస్కారాలు నిర్వహించారు.
కలిసే బతికారు.. కన్నుమూశారు
పంటను కాపాడే ప్రయత్నంలో రైతు దంపతులను మింగేసిన ‘కరెంట్ షాక్’
గంభీరావుపేటలో విషాదం


