పక్కాప్లాన్‌.. రూ.4.5లక్షల డీల్‌ | - | Sakshi
Sakshi News home page

పక్కాప్లాన్‌.. రూ.4.5లక్షల డీల్‌

Oct 2 2026 3:03 AM | Updated on Oct 2 2026 3:03 AM

పరిచయం పెంచుకుని.. మద్యం తాగుదామని రప్పించి కత్తులతో గొంతుపై పొడిచి రాకేశ్‌ దారుణ హత్య వివాహేతర సంబంధం.. పాతకక్షలే కారణం హత్యకేసులో నలుగురు నిందితుల అరెస్ట్‌ వివరాలు వెల్లడించిన ఏసీపీ మాధవి

హుజూరాబాద్‌: పక్కా ప్లాన్‌ వేశారు.. తొలుత పరిచయం చేసుకున్నారు.. స్నేహం పెరిగాక మద్యం తాగుదామని ఆహ్వానించారు.. ఆ తర్వాత కత్తులతో పొడిచి హత్య చేశారు.. మృతదేహాన్ని ఎస్సారెస్పీ కాలువలో పడవేసి వెళ్లిపోయారు.. ఉమ్మడి వరంగల్‌ జిల్లా కమలాపూర్‌ మండలం ఉప్పల్‌పల్లి గ్రామానికి చెందిన వడిగే రాకేశ్‌(30) హత్య కేసు దర్యాప్తులో పోలీసులు తేల్చిన అంశాలు ఇవీ.. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్‌ చేయగా, మరోఐదుగురు పరారీలు ఉన్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ వాసంశెట్టి మాధవి వివరాలు వెల్లండించారు. ఉప్పల్‌పల్లికి చెందిన వడిగే రాకేశ్‌కు అదేగ్రామానికి చెందిన అమరగొండ ప్రశాంత్‌ భార్యతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానాల నేపథ్యంలో ఇద్దరి మధ్య గతంలోనే వివాదాలు చోటుచేసుకున్నాయి. గ్రామ పెద్దల సమక్షంలోనూ పలుమార్లు పంచాయితీలు జరిగాయి. అయినా సమస్య సమసిపోలేదు. రాకేశ్‌ను ఎలాగైనా చంపాలని ప్రశాంత్‌ పథకం వేశాడు.

రూ.4.5 లక్షలకు డీల్‌?

రాకేశ్‌ హత్యకు పథకం రూపొందించిన ప్రశాంత్‌.. గతంలో తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన రాజ్‌కుమార్‌ను సంప్రదించి సహకరించాలని కోరాడు. ఇందుకోసం రిత్విక్‌, తుమ్ముల అఖిల్‌, టి.అఖిల్‌, రాహుల్‌, బి.చందు, బి.అజయ్‌, గణేశ్‌ను పథకంలో భాగం చేశాడు. ఇందుకోసం రూ.4.50 లక్షలు ఇచ్చేలా డీల్‌ కుదుర్చుకున్నాడు.

మద్యం తాగుదామని రప్పించి..

డ్రైవర్‌ రాజ్‌కుమార్‌ పథకం ప్రకారం రాకేశ్‌తో పరిచయం పెంచుకున్నాడు. స్నేహం పెరిగాక మద్యం తాగుదామని చెప్పి ఎల్కతుర్తికి రప్పించాడు. ఆ తర్వాత సెప్టెంబర్‌ 27న హుజూరాబాద్‌ తీసుకెళ్లి మద్యం తాగిన తర్వాత పెద్దపాపయ్యపల్లి శివారులోని ఎస్సారెస్పీ కాలువ వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ ప్రశాంత్‌తోపాటు మిగతా నిందితులు చేరుకున్నారు. వారిని చూసిన రాకేశ్‌ భయపడి తప్పించుకునేందుకు యత్నించాడు. అడ్డుకున్న నిందితులు కత్తులతో దాడిచేశాడు. ప్రశాంత్‌ కత్తితో గొంతుపై పొడవడంతో రాకేశ్‌ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత మృతదేహాన్ని కాలువలో పడవేసి వెళ్లిపోయారు. మృతుడి తల్లి వడిగే దేవక్క ఫిర్యాదు మేరకు అన్ని కోణాలు దర్యాప్తు చేసిన పోలీసులు..

ఎల్కతుర్తిలో అదుపులోకి..

ఎల్కతుర్తిలోని అద్దె ఇంట్లో తలదాచుకున్న అమరగొండ ప్రశాంత్‌, రాజ్‌కుమార్‌, అమరగుండ రిత్విక్‌, తుమ్ముల అఖిల్‌ను గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి కత్తులు, రెండు ద్విచక్రవాహనాలు, మొబైల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. టి.అఖిల్‌, రాహుల్‌, బి.చందు, బి.అజయ్‌, గణేశ్‌ పరారీలో ఉన్నారు. సమావేశంలో టౌన్‌ సీఐ కరుణాకర్‌, ఎస్‌ఐ కె.రవి, పోలీసులు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement