జ్యోతినగర్: పొట్టకూటి కోసం సొంతూరును వదిలి వచ్చి.. చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తిని రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకుల్లో తనకంటూ ఓ దారిని వెతుక్కుంటున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన అరుణ్ కుమార్ పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్‌లో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు. మంచిర్యాలలోని సున్నంబట్టి ప్రాంతంలో నివాసం ఉంటున్న అరుణ్‌కుమార్(49) వారసంతల్లో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం ఉదయం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్‌లో టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెనకాల వచ్చిన లారీ ఢీకొట్టింది. అరుణ్‌కుమార్ లారీకి చిక్కుకోగా సుమారు కిలోమీటరు దూరం వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. లారీ డ్రైవర్ పరారయ్యాడు. కుటుంబానికి అండగా నిలవాల్సిన అరుణ్‌కుమార్ దుర్మరణం చెందడం విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న ఎస్సై ఉదయ్‌కిరణ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. లారీ ముందు భాగంలో చిక్కుకున్న మృతదేహాన్ని క్రేన్ సాయంతో బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబానికి చెందిన రామ్ త్రిపాల్ గోస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
చిరువ్యాపారిని ఢీకొట్టిన లారీ
ఉత్తరప్రదేశ్‌వాసి అరుణ్ కుమార్ దుర్మరణం


