కొండగట్టు
‘పర్యాటకం’పై
మల్యాల: ప్రకృతి ఒడిలో విరాజిల్లుతున్న కొండగట్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే భక్తుల విన్నపాలు అరణ్య రోధనగా మారుతున్నాయి. మెట్లదారి వెంట రోప్‌వే నిర్మాణం చేపట్టేందుకు దశాబ్దం క్రితం పదెకరాల స్థలం కేటాయించినా.. ఇప్పటివరకు అడుగు ముందుకు పడలేదు. కేంద్రప్రభుత్వ ‘ప్రసాదం’ పథకంలో కొండగట్టు ఆలయానికి చోటు లభించినా.. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చొరవ చూపడం లేదు. కొండగట్టు అంజన్న ఆలయం భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతోంది. చుట్టూ గుట్టలు.. ఎత్తైన చెట్లు.. కనుచూపు మేర ప్రకృతి సోయగాలతో మైమరిపించే ఆహ్లాదకర వాతావరణం ఈ క్షేత్రం సొంతం. అంజన్నను దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. నిర్మల్ కొయ్య బొమ్మల తయారికి వినియోగించే కలప ఇక్కడి గుట్టల్లో పెరుగుతుంటాయి.
ఆలయానికి 370 ఎకరాల రెవెన్యూ భూమి
కొండగట్టు ఆలయ అభివృద్ధికి రెవెన్యూకు చెందిన సుమారు 370 ఎకరాల భూమి దశాబ్దకాలం క్రితం అప్పగించారు. కొండగట్టు ఆలయ పరిసరాలు చదును భూమి కేవలం 60 ఎకరాలు మాత్రమే ఉండగా.. గుట్టలు, అటవీశాఖ భూమి ఉండడంతో సరిహద్దు వివాదం తలెత్తింది. అయితే అటవీ శాఖకు ప్రత్యామ్నయంగా ఆలయానికి చెందిన భూమి కేటాయించాలనే ప్రతిపాదనలతో ఆ వివాదం సద్దుమణిగింది.
రోప్‌వే ప్రతిపాదన..
ఆలయాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రోప్ వే నిర్మాణం చేపట్టాలని దశాబ్దకాలం క్రితం ప్రతిపాదనలు తయారు చేశారు. మెట్లదారి నుంచి హరిత హోటల్ వరకు రోప్ వే నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదన మేరకు పర్యాటక శాఖకు 10 ఎకరాలు కూడా కేటాయించారు. కానీ ఇప్పటివరకు అడుగు ముందుకుపడలేదు. ప్రస్తుతం అధికారులు మెట్లదారి వెంట పారిశుధ్యం చేపట్టకపోవడంతో ఆ దారిమీదుగా వెళ్లాలంటేనే భక్తులు ఇబ్బంది పడుతున్నారు.
నీతిఅయోగ్‌లో కొండగట్టుకు స్థానం..
దేశశంలోని దర్శనీయ స్థలాల దివ్యభారత్ జాబితాలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికీ చోటు దక్కింది. అయినప్పటికీ భక్తులకు కనీస వసతులు కరువయ్యాయి. భక్తుల వాహనాలకు కనీసం పార్కింగ్ సౌకర్యం లేక ఇబ్బంది పడాల్సి వస్తోంది.
రోప్‌వే నిర్మాణానికి దశాబ్దం క్రితం ప్రతిపాదనలు
పదెకరాల స్థలం కేటాయింపు
అయినా ముందుకు పడని అడుగు


